Israel strikes chemical weapons sites in Syria : సిరియాలోని అనుమానిత రసాయన ఆయుధాగారాలు, దీర్ఘశ్రేణి రాకెట్లపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. శత్రువుల చేతికి చిక్కకుండా దాడుల జరిపి వాటిని ధ్వంసం చేశామని సోమవారం ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అలాగే ఇరాన్, హెజ్బొల్లాకు మద్దతు ఇస్తున్న అసద్ ప్రభుత్వం కూలిపోవడాన్ని స్వాగతించింది. అయితే సిరియాలో తదుపరి ఎవరు పగ్గాలు చేపడతారో అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది.
'సిరియా పరిస్థితి ఆందోళనకరం'
"ఇరాన్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌నకు కీలక మిత్రుడైన అసద్ ప్రభుత్వం కూలిపోవడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే సిరియాలో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నాం. 1974 నాటి ఒప్పందం ప్రకారం సిరియాలోని బఫర్‌జోన్‌ను బలగాలు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాయి. మాకు పౌరుల భద్రత ముఖ్యం. అందుకే మేము వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలపై దాడి చేశాం. తీవ్రవాదుల చేతుల్లో పడకూడదని సిరియాలోని రసాయన ఆయుధాగారాలు, దీర్ఘశ్రేణి క్షిపణులు, రాకెట్లపై దాడులు జరిపాం." అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ వ్యాఖ్యానించారు.
విమానాశ్రయంపై దాడులు
సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోని మెజ్జే సైనిక విమానాశ్రయం ప్రాంతంలో ఆదివారం వైమానిక దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు చేసిందెవరనే విషయం ఇంకా తెలియలేదు. ఈ విమానాశ్రయం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లక్ష్యంగా ఉండేది. తాజాగా సిరియాలోని రసాయన ఆయుధాగారాలు, రాకెట్లపై దాడులు జరిపింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించడం గమనార్హం.
వందలాది దాడులు
సిరియాలోని ఇరాన్, హెజ్బొల్లా మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ వందలాది వైమానిక దాడులు చేసింది. అయితే ఇలాంటి సింగిల్ టార్గెట్ దాడులపై ఇజ్రాయెల్ అధికారులు అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తారు.
అసద్‌కు ఆశ్రయం - రష్యా అధికారిక ప్రకటన
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించినట్లు రష్యా సోమవారం అధికారికంగా ప్రకటించింది. అసద్‌కు ఆశ్రయం ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అసద్‌తో భేటీ అయ్యే ఆలోచనలో పుతిన్ లేరని పెస్కోవ్ అన్నారు. అయితే రష్యాలో అసద్ ఎక్కడున్నారనే సమాచారం చెప్పలేదు.
మరోవైపు, అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియా వీడారని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇక, అసద్ వెళ్లిపోయిన తర్వాత అధ్యక్ష భవనంలోకి ప్రజలు దూసుకెళ్లారు. అక్కడి ఫర్నిచర్, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు బయటకు వచ్చాయి.
54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర!
కాగా, అసద్ నిష్క్రమణతో సిరియాలో 54 ఏళ్ల ఆయన కుటుంబ పాలనకు తెరపడినట్లైంది. అసద్ తండ్రి హఫీజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణించేంతవరకు (2000) సిరియాను పాలించారు. ఆ తర్వాత అసద్ సిరియా పగ్గాలు అందుకున్నారు. తాజాగా తిరుగుబాటుదారులు దేశ రాజధానిని అధీనంలోకి తీసుకోవడం వల్ల సిరియాను అసద్ వీడారు.