Israel Cyber Attacks On Iran : ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్‌లోని అణుస్థావరాలు, చమురు క్షేత్రాలు, మౌలిక సదుపాయాలు ఇలా అనేక లక్ష్యాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇరాన్‌లో అణుస్థావరాలు, ప్రభుత్వ విభాగాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ స్థాయిలో సైబర్ దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. విలువైన సమాచారం చోరీకి గురైనట్లు తెలిపింది.
అక్టోబర్ 1వ తేదీన 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన దగ్గర నుంచి పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై ప్రతీకార దాడి తప్పదని హెచ్చరికలు చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇరాన్‌పై ప్రతీకార దాడి కోసం ఆయన కేబినెట్ అనుమతి తీసుకునే అవకాశం ఉంది. ఇరాన్‌లో సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఇజ్రాయెల్ దాడులు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పౌరులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా ఇజ్రాయెల్ పట్టించుకోదని, లెబనాన్, గాజాలో ఇప్పుడు అదే జరుగుతోందని తెలిపారు.
వాటిపైనే గురి!
ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు, మిస్సైల్ లాంచింగ్ సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉంది. ఇరాన్‌కు చెందిన అణు స్థావరాలపైనా దాడి చేయాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది. అవి ఎక్కువగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాయి. ఐతే ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు అమెరికా అంగీకరించడం లేదు. ఈ మేరకు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తే అది ఆ ప్రాంతంలో రేడియేషన్ వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతంలో మోహరించి ఉన్న అమెరికా దళాలకు అది ముప్పు కలిగించవచ్చు. అంతేకాకుండా UAE, ఖతార్, బహ్రాయిన్, సౌదీ అరేబియా- అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్నాయి. అవన్నీ ఇరాన్‌కు సమీపంలో ఉన్నందున ఆయా దేశాలకు రేడియేషన్ వ్యాప్తి కారణంగా ముప్పు కలగవచ్చు.
ఇరాన్‌పై సైనిక దాడులతో పాటు సైబర్ యుద్ధాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. హెజ్‌బొల్లాపై నిర్వహించిన పేజర్ దాడుల తరహాలో ఇరాన్‌పై విరుచుకుపడాలని చూస్తోంది. శనివారం ఇరాన్‌లో భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగాయి. అక్కడి న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు అంతరాయం కలిగింది. అణుస్థావరాలే లక్ష్యంగా కూడా ఈ దాడులు జరిగాయి. దీని ఫలితంగా సమాచారం చోరీకి గురైందని ఇరాన్ సైబర్‌స్పేస్ విభాగంలో పనిచేసిన మాజీ కార్యదర్శిని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా తెలిపింది. ఇంధన పంపిణీ, మున్సిపల్ నెట్‌వర్క్‌లు, రవాణా నెట్‌వర్క్‌లు, పోర్టులు సహా ఇతర రంగాలు కూడా ఇజ్రాయెల్ సైబర్ దాడులతో ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఇరాన్ చమురు క్షేత్రాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగేందుకు కారణం కావచ్చు. ఇప్పుడు ఇరాన్‌పై ఏ తరహా దాడులను ఇజ్రాయెల్ చేయనుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అది పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు. మరోవైపు అమెరికా కూడా ఇరాన్‌కు చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై ఆంక్షలను విస్తరించింది. ఇరాన్ నిధులు సమకూర్చుకునే సామర్ధ్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.