Israel Airstrike On Rafah : ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా ఆ దేశ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మరణించారు. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుస బాంబు దాడులు జరిగాయని గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు తెలిపింది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అటు ఈ దాడిని ఇజ్రాయెల్ ఖండించింది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తమకు తెలియదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇజ్రాయెల్ రాజధానిలో సైరన్ల మోత
అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్ దీర్ఘ శ్రేణి రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. టెల్ అవీన్లో సైరన్లు మోగడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి అని చివరగా జనవరిలో హమాస్ రాకెట్లు ప్రయోగించిదని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే తమ పౌరులపై జరుగుతున్న మారణకాండకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు హమాస్ తెలిపింది. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు జరిపినట్లు హమాస్ పేర్కొంది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. ఈ దాడులకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినట్లు ఉంది.
గాజాలోకి మానవతా సాయం
మరోవైపు ఈజిప్టు నుంచి ఐక్యరాజ్యసమితి మానవతా సాయం ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా 126 ట్రక్కులు గాజాలోకి వెళ్లాయని ఈజిప్టు రెడ్ క్రెసెంట్ సంస్థ తెలిపింది. ఈ నెల ఆరో తేదీన రఫా క్రాసింగ్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించడం వల్ల గాజాకు మానవతా సాయం నిలిచిపోయింది. మరోవైపు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే దిశగా నార్వే చర్యలు చేపట్టింది. దౌత్య పత్రాలను పాలస్తీనా ప్రధానికి అందజేసింది. మే 28నుంచి పాలస్తీనాకు స్వతంత్ర దేశంగా అధికారిక గుర్తింపు ఇవ్వనున్నట్లు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ఇటీవల ప్రకటించాయి.
'రఫాపై సైనిక చర్యను తక్షణమే ఆపండి'- ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం - Israel Gaza War