Hezbollah Vs Israel War : హెజ్‌బొల్లా- ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పైకి 100కు పైగా రాకెట్లు దూసుకొచ్చి విధ్వంసం సృష్టించాయి. చాలా క్షిపణులను ఇజ్రాయెల్ మిస్సైల్స్ గాల్లోనే పేల్చివేశాయి. ఆ క్షిపణులకు సంబంధించిన శిథిలాలు హైఫా, నజారెత్ ప్రాంతాల్లో పడ్డాయి. హైఫా, రమత్ డేవిడ్ వైమానిక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాది 1, ఫాది 2 మిస్సైల్స్ ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది. బీరుట్‌లో ఐడీఎఫ్ వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.
400 లక్ష్యాలపై దాడులు
రాకెట్ దాడుల ఘటనల్లో హైఫాతో పాటు లోవర్ గెలీలీ ప్రాంతాల్లో మొత్తం ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు ఇజ్రాయెల్ తెలిపింది. పలు భవంతులు దెబ్బతిన్నాయని, కార్లు దగ్ధమయ్యాయని పేర్కొంది. రాకెట్లు దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని చాలా ప్రాంతాల్లో సైరన్‌లు మోత మోగింది. హెజ్‌బొల్లా రాకెట్ దాడుల వేళ, గోలన్‌హైట్స్ సహా నార్త్ ఇజ్రాయెల్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రజలు గుమిగూడి ఉండకూడని స్పష్టం చేసింది. అటు లెబనాన్ సరిహద్దు గ్రామాల్లో ఐడీఎఫ్ బలగాలు భారీ కాల్పులకు పాల్పడుతూ బీరుట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక్క రోజులోనే హెజ్‌బొల్లాకు చెందిన వేలాది రాకెట్ లాంఛర్లు సహా 400 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
45 రోజులపాటు మూసివేయాలని ఆదేశాలు
మరోవైపు, వెస్ట్‌బ్యాంక్‌లోని రమానల్లాహ్‌లో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ అల్‌జజీరా కార్యాలయాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేసి కార్యకలాపాలను అడ్డుకున్నాయి. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి పరిస్థితులను అల్‌జజీరా విస్తృతంగా ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలోనూ అల్‌జజీరా న్యూస్ ఛానల్‌పై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై వార్తలు ప్రసారం చేయద్దంటూ 45 రోజులపాటు మూసివేయాలని అల్‌జజీరా బ్యూరోను సైనికులు ఆదేశించారు. సిబ్బంది తక్షణమే కార్యాలయాలను విడిచిపెట్టి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించిన పాలస్తీనా అమెరికన్ జర్నలిస్టు షిరేన్ అబు అక్లే బ్యానర్‌ను చింపిపారేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అల్ జజీరా విడుదల చేసింది.
హెజ్‌బొల్లా 'మిలిటరీ'కి చావుదెబ్బ - ఇక మిగిలింది ముగ్గురేనా! - Top Hezbollah Commanders Killed
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా నం.2 ఇబ్రహీం అకీల్ హతం! - Hezbollah Commander Ibrahim Killed