Hamas Offered Hostages For Ceasefire : ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధానికి కాస్త బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ల మధ్య సుదీర్ఘ కాలంపాటు కాల్పుల విరమణకు సంబంధించిన ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఒకవేళ దీనికి ఆమోద ముద్ర లభిస్తే గనుక అది 3 దశల్లో అమలు కానుంది. ఈ మేరకు తమ ప్రతిపాదన లేఖను హమాస్ నేతలు ఖతార్, ఈజిప్టులోని మధ్యవర్తుల బృందానికి పంపారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది.
ఒక్కో దశ 45 రోజుల చొప్పున 3 దశల్లో అమలయ్యేలా కాల్పుల విరమణకు సంబంధించిన అంశాలను ఈ ప్రతిపాదనలో పొందుపర్చింది హమాస్. దీని ప్రకారం పాలస్తీనా ఖైదీలకు బదులుగా మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తారు. అంతేకాకుండా గాజా పునర్నిర్మాణం, ఇజ్రాయెల్ దళాల ఉప సంహరణ, మృతదేహాల మార్పిడి వంటి అంశాలను హమాస్ పంపిన లేఖలో పేర్కొంది.
ఇజ్రాయెల్‌కు చెందిన మహిళలు, 19ఏళ్ల లోపు యువతీయువకులను, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను తొలి 45 రోజుల్లో హమాస్ విడుదల చేస్తుంది. దీనికి బదులుగా పాలస్తీనా మహిళలు, చిన్నారులకు జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది. మిగిలిన బందీలను రెండో దశలో, దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను మూడో దశలో పరస్పరం అప్పగించుకోవాలని ప్రతిపాదనలో స్పష్టం చేశారు హమాస్ నేతలు.
ఇలాగైనా యుద్ధానికి బ్రేక్ పడనుందా?
Israel Palestine War : ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ పచ్చజెండా ఊపితే గనుక ఎలాగైనా యుద్ధాన్ని ముగించవచ్చని ఆశాభావంతో హమాస్ నాయకులు ఉన్నారు. 1500 మంది ఖైదీలను విడుదల చేయాలని హమాస్ కోరుతోంది. కాగా, వీరిలో దాదాపు మూడోవంతు మందికి ఇజ్రాయెల్ జీవిత ఖైదు విధించింది. ఇదిలాఉంటే హమాస్‌వద్ద బందీలుగా ఉన్న 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, తాము వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. అయితే బందీల విడుదలకు హమాస్ నుంచి సానుకూలమైన సంకేతాలు వస్తుండడం కాస్త ఊరటనిచ్చే అంశమని భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు.
తగ్గేదేలే : నెతన్యాహు
Netanyahu Counter On Hamas Proposal : మరోవైపు హమాస్ నేతల డిమాండ్లకు తలొగ్గేదే లేదని, విజయానికి అత్యంత చేరువలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. 'గాజాలో విజయానికి దగ్గర్లో ఉన్నాం. కొన్ని నెలల్లోనే యుద్ధాన్ని ముగిస్తాం. హమాస్‌ను అంతమొందించడం, బందీలను విడిపించుకోవడం, ఇజ్రాయెల్‌కు గాజా ప్రమాదకరం కాకుండా చేయడమే మా లక్ష్యాలు. ఖాన్ యూనిస్ తర్వాత రఫాలో భూతల దాడులు చేస్తాం. సంపూర్ణ విజయానికి ప్రత్యామ్నాయం లేదు. సైనిక ఒత్తిడి ద్వారానే బందీల విడుదల సాధ్యం. హమాస్ డిమాండ్లను అంగీకరించడమంటే విపత్తును స్వాగతించడమే' అని బుధవారం ఆయన మీడియాతో చెప్పారు.
'పూర్తి కాల్పుల విరమణ పాటిస్తే బందీల విడుదలకు రెడీ'- స్పష్టం చేసిన హమాస్
సంక్షోభం వేళ పాక్‌లో ఎన్నికలు- పోలింగ్‌కు 13 కోట్ల మంది రెడీ- పైచేయి ఆయనదే!