Hamas Attack UN Agency Employees : పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏపై విషయంలో ఇజ్రాయెల్ కీలక అంశాన్ని లేవనెత్తింది. యుద్ధం అనంతరం గాజాలో ఆ ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపేయాలని కోరతామని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అవసరమైతే అమెరికా, యూరోపియన్ యూనియన్ మద్దతు కూడా తీసుకుంటామని తెలిపారు.
ఈ విషయంపై హమాస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాలస్తీనియన్ల రక్షణ కోసం పనిచేస్తున్న ఏజెన్సీలను భయపెట్టాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని విమర్శించింది.
12మంది ఉద్యోగులు తొలగింపు
అయితే అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన మారణహోమంలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూ ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ విషయంపై యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిని ఉద్యోగులను తొలగించామని పేర్కొన్నారు. అలానే ఇజ్రాయెల్ సమాచారం ఆధారంగా దీనిపై తక్షణమే దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. మానవతా సాయం అందించే యూఎన్ ఏజెన్సీని రక్షించే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ లజారిని పేర్కొన్నారు.
ఏజెన్సీకి నిధులు నిలిపివేసిత
ఈ నేపథ్యంలో ప్రకటన వెలువడిన వెంటనే ఏజెన్సీకి ఇచ్చే అదనపు నిధుల మంజూరును అమెరికా నిలిపివేసింది. పూర్తిస్థాయిలో సమీక్ష చేసిన తర్వాతనే ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకి నిధులను నిలిపివేశాయి.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ఘటనలో సుమారు 1200 మంది మరణించారు. 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ బలగాలు హమాస్ లక్ష్యంగా గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26,083 మంది మృతిచెందినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిపింది.
ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్- మిలిటెంట్ దాడిలో 21 మంది సైనికులు మృతి
హమాస్ చెరలోనే ఇంకా బందీలు- ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల్లో విభేదాలు!