H1B Visa New Rules 2024 : హెచ్-1బీ వీసాల నమోదు ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసా ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై ఒక లబ్ధిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా ఒకే అప్లికేషన్‌గా పరిగణించనున్నారు. ఒకే లబ్ధిదారుని తరఫున అనేక రిజిస్ట్రేషన్లు సమర్పించి సంస్థలు, లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు యత్నిస్తున్నందువల్ల అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది.
'దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు కల్పించేందుకే'
రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా దరఖాస్తుదారులకు సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం వెల్లడించింది. ప్రతీ లబ్ధిదారు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. తప్పుడు సమాచారం ఉన్న పిటిషన్లను తిరస్కరించే నిర్ణయం USCISకు ఉంటుంది. పాస్‌పోర్టు, ఇతర గుర్తింపు వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్-1బీ వీసాల మొదటి రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగనుంది. ఈలోగా రిజిస్ట్రేషన్, దరఖాస్తు రుసుము చెల్లింపుల కోసం USCIS ఆన్‌లైన్ అకౌంట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి కంపెనీలు తమ ఖాతాలను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఫామ్ ఐ-129, నాన్- క్యాప్ హెచ్-1బీ పిటిషన్ల కోసం ఫామ్ ఐ-907 పత్రాలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుందని USCIS వెల్లడించింది.
నాన్ ఇమిగ్రేషన్ పొందేవారిలో ఎక్కువమంది భారతీయులే!
వృత్తి నిపుణులకు ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటారు. ఇందుకోసం ఏటా 65 వేల వీసాలతో పాటు మాస్టర్స్ డిగ్రీ చేసే వారి కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తారు. నాన్ ఇమిగ్రేషన్ హెచ్-1బీ వీసాలను పొందేవారిలో ఎక్కువమంది భారతీయులే ఉంటున్నారు. ఈ నాన్- ఇమిగ్రేషన్ వీసాలు అనేవి అమెరికాలో కొంతకాలం ఉండాలనుకునేవారికి ఇస్తారు. వీటిని కంప్యూటరైడ్జ్ లాటరీ విధానంలో ఎంపిక చేసి జారీ చేస్తుంటారు. అయితే గత కొంత కాలంగా కంప్యూటరైడ్జ్ లాటర్ సిస్టమ్‌ను దుర్వినియోగ పరుస్తున్నారనే విషయం అగ్రరాజ్యం అమెరికా దృష్టికి వచ్చింది. కొన్ని కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు వీసాలు దక్కే అవకాశాలను పెంచుకునేందుకు ఈ లాటరీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లుగా తేలింది. దీంతో హెచ్-1 వీసాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆధునీకరించేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తాజాగా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
జోరు మీదున్న అమెరికా- ఏడాదిలో భారతీయులకు 14లక్షల వీసాలు జారీ
అమెరికా మాజీ అధ్యక్షుడికి భారీ ఊరట- ట్రంప్ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు ఓకే