God Particle Scientist Peter Higgs Died : దైవకణాన్ని కనుగొన్న బ్రిటన్ దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ కన్నుమూశారు. 94 ఏళ్ల హిగ్స్ తన నివాసంలో ప్రశాంతంగా కన్నుమూశారని, అంతకుముందు రోజు ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని స్కాట్లాండ్లోని ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీ వెల్లడించింది. గొప్ప ఉపాధ్యాయునిగా, మార్గనిర్దేశకునిగా, యువ శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని స్కాటిష్ యూనివర్సిటీ కొనియాడింది.
'దైవకణం' లేదా 'హిగ్స్‌బోసన్' సిద్ధాంతంతో విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎలక్ట్రాన్, క్వార్క్, కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో చిక్కుముడులు విప్పిన ఆయన 1964లో బోసన్ కణం ఉనికిని తన సిద్ధాంతాల ద్వారా తెలియజేశారు. 2012లో యూరోపియన్ ఆర్గనేజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌లోని లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్‌లో దైవకణం(God Particle)పై ప్రయోగాలు చేశారు. ఆ ఫలితాల ఆధారంగా అర శతాబ్దానికి ముందే హిగ్స్ రూపొందించిన సిద్ధాంతాన్ని, బోసన్ కణం ఉనికిని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. తన సిద్ధాంతానికి బెల్జియన్ భౌతికశాస్త్రవేత్త ఫ్రాంకోయిస్‌తో కలిసి ఆయన 2013లో నోబెల్ బహుమతి అందుకున్నారు. కాగా, ఈ ప్రయోగాల సమయంలో హిగ్స్‌కు మరికొంతమంది శాస్త్రవేత్తలు తమ సహాయసహకారాలు అందించారు.
హిగ్స్ దాదాపు ఐదు దశాబ్దాలపాటు ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా తన సేవలందించారు. ఈ యూనివర్సిటీతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న హిగ్స్ ఉత్తీర్ణులయ్యారని ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రకటించింది. కానీ అందుకుగల కారణాన్ని మాత్రం పేర్కొనలేదు.
పీటర్ హిగ్స్ పూర్తి పేరు పీటర్ వేర్ హిగ్స్. ఈయన 1929 మే 29న ఇంగ్లాండ్‌లోని న్యూకాజిల్ అపాన్ టైన్‌లో జన్మించారు. తండ్రి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)లో సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశారు.
పీటర్ హిగ్స్‌కు తొలుత రసాయన శాస్త్రంలో ఆసక్తి ఉండేది. అందులోనే సైంటిస్ట్ కావాలని భావించారు. కానీ, ల్యాబ్‌లో తాను నిస్సహాయంగా ఉంటున్నానని గమనించిన ఆయన తన లక్ష్యాన్ని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంవైపు మళ్లించారు. అలా హిగ్స్ ఈ రంగంలో విశేష కృషి చేసి ఓ గొప్ప దిగ్గజ భౌతిక శాస్త్రవేత్తగా మారారు.
హిగ్స్ కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి మూడు డిగ్రీ పట్టాలను పొందారు. ఇందులో 1954లో ఫిజిక్స్‌లో పూర్తి చేసిన పీహెచ్డీ కూడా ఉంది. వీటితో ఆయన ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీలో అడుగుపెట్టారు. ఇక అప్పట్నుంచి ఐదు దశాబ్దాలుగా ఇక్కడే తన సేవలు అందించారు. 1996లో పదవీ విరమణ పొందారు.