Food Crisis In Gaza : యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొనడం వల్ల తినడానికి తిండి దొరకక గాజా పౌరులు కలుపు మొక్కలను తింటున్నారు. కఠినమైన పొడి నేలలో స్వేచ్ఛగా పెరిగే మాలో అనే మొక్కను వారు ఆహారంగా తీసుకుంటున్నారు. ఆ మొక్కకు ఔషధ గుణాలు ఉన్నాయని గాజా పౌరులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలోకి తగినంతగా సహాయక సామగ్రి రావడం లేదు. వేరే గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సిన పరిస్థితి గాజా పౌరులకు తలెత్తింది.
పిల్లలకూ వాటినే
ఇజ్రాయెల్ దాడులతో ఉత్తర గాజా ఎటు చూసినా శిథిలాలమయంగా కనిపిస్తోంది. నీరు, ఆహారం, ఔషధాల కొరత అక్కడ నెలకొంది. యుద్ధ ట్యాంకులకు ఎదురుగా ఉన్న తాము మరో గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు వాటినే తినిపిస్తున్నట్లు తెలిపారు.
గాజాలోని 23 లక్షల మంది జనాభాలో 80 శాతం మంది యుద్ధం కారణంగా తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది. ఈజిప్టుతో సరిహద్దు కలిగి ఉన్న రఫా నగరంలో ఏకంగా 14 లక్షల మంది తలదాచుకుంటున్నారు.
మరోసారి గాజాపై ఐడీఎఫ్ దాడులు
Israel Hamas War Latest Update : ఇటీవలే గాజా పట్టీలో ఇజ్రాయెల్ బలగాలు దాడులు మరింత తీవ్రం చేశాయి. గురువారం ఇజ్రాయెల్ సేనలు జరిపిన వైమానిక, భూతల దాడుల్లో 100 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడింట రెండొంతులు మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. వందలాది మంది గాయపడ్డారని, చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. దక్షిణ గాజాలోని రఫా నగరం, మధ్య గాజాలోని దెయిర్ అల్ బలాహ్, నుస్సేరత్ శరణార్థి శిబిరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ బాంబులతో విరుచుకుపడింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం కీలక పత్రాన్ని తన వార్ కేబినెట్ ముందు ప్రవేశపెట్టారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత గాజాను ఎలా నియంత్రించాలన్న ప్రణాళికను ఆ పత్రంలో పేర్కొన్నారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎట్టకేలకు తల్లి వద్దకు నావల్నీ మృతదేహం- చనిపోయాక కూడా చిత్రహింసే!
ఎన్నికల రేసులో దూసుకెళ్తున్న ట్రంప్- నిక్కీ హేలీకి షాక్- సొంత రాష్ట్రంలోనే చుక్కెదురు!