Elon Musk To Interview Trump : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అటు డెమొక్రటిక్, ఇటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ర్యాలీలు చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరంపరలో వివిధ టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రముఖులతో చర్చిస్తూ తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కీలక విషయం వెల్లడించారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తనని ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు వెల్లడించారు. ఆగస్టు 12న (సోమవారం) ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అయితే మస్క్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఇంటర్వ్యూ ఎక్స్‌లో ప్రసారమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ట్రంప్‌ను ఎక్స్ (అప్పట్లో ట్విటర్) నిషేధించిన విషయం తెలిసిందే.
మరోవైపు మస్క్ తానే సృష్టించినట్లుగా చెబుతున్న పొలిటికల్ యాక్షన్ కమిటీ (PAC)పై మిషిగన్, నార్త్ కరోలినా ఎన్నికల బోర్డు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కమిటీ ఓటర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనేకమందిపై నిఘా వేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్నీ సేకరిస్తోందనే వాదన ఉంది. వీటన్నింటిపై తాజాగా ఎన్నికల అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ పీఏసీ ట్రంప్‌నకు మద్దతుగా పనిచేస్తోంది. ఈ తరుణంలో మస్క్‌తో ఇంటర్వ్యూ ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పోటాపోటీగా
అమెరికా అధ్యక్ష రేసులో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న భారత, ఆఫ్రికన్ సంతతి కమలా హారిస్, ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను ఎన్నుకున్నారు. 60 ఏళ్ల వాల్జ్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోవడంలో, హారిస్ తన ప్రచారాన్ని ఎగువ మిడ్‌వెస్ట్‌లో బలపరచాలని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష రాజకీయాల్లో ఎగువ మిడ్‌వెస్ట్ కీలకమైన ప్రాంతంగా భావిస్తారు.
ట్రంప్ ప్రతిపాదనకు నో
అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 4న ఫాక్స్ న్యూస్ ఛానెల్ ఆధ్వర్యంలో డిబేట్ చేద్దామంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రతిపాదనను, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తిరస్కరించారు. జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారమే, సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ ఆతిథ్యంలో డిబేట్ చేద్దామని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ - Yunus as head of Bangladesh govt