Donald Trump Attacked : సాయుధుడు జరిపిన కాల్పుల్లో తన చెవికి గాయమవ్వడం వల్ల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు జాగ్రత్తగా సీటీ స్కాన్ చేయించుకున్నారు. ఆ స్కాన్‌లో ట్రంప్‌నకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్య లేదని తేలినట్లు తెలుస్తోంది. ఇతర ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారా? లేదా? అనే విషయం ఇంకా తెలియలేదు.
హత్యాయత్నం జరిగిన మరుసటి రోజే!
మరోవైపు హత్యాయత్నం జరిగిన మరుసటి రోజే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు హాజరయ్యేందుకు ఆదివారం మిల్వాకీ చేరుకున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై ఎఫ్‌బీఐ ముమ్మురంగా దర్యాప్తు జరుపుతోంది. దాడికి పాల్పడడానికి గల కారణం, భద్రతా వైఫల్యంపై దర్యాప్తు చేపడుతోంది.
'దాడికి స్థానిక పోలీసుల వైఖరే కారణం'
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడి జరగడానికి స్థానిక పోలీసుల వైఖరే కారణమని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ తెలిపింది. థామస్ మాథ్యూ క్రూక్స్ పైకప్పు ఎక్కి గన్ పొజిషన్ తీసుకొన్నా పట్టించుకోలేదని చెబుతోంది. ట్రంప్ రక్షణకు సంబంధించి తమ పరిధి దూరానికి మించి అది ఉందని వాదిస్తోంది. సమావేశం జరిగిన ఏజీఆర్ ఇంటర్నేషనల్ ఐఎన్‌సీ ఫ్యాక్టరీ గ్రౌండ్స్‌ను పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదేనని పేర్కొంది.
నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ 130 మీటర్ల దూరం నుంచి ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అంత దూరంలో రక్షణ బాధ్యత స్థానిక పోలీసులదేనని సీక్రెట్ సర్వీస్ ఆంటోనీ గుగ్లెమీ వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ట్రంప్ ర్యాలీ జరిగే గ్రౌండ్స్‌ను మాత్రం సీక్రెట్ సర్వీస్ చూస్తుందని పేర్కొన్నారు. దాని బయట ప్రదేశాల భద్రత చూసేందుకు స్థానిక పోలీసులను నియమిస్తారని వెల్లడించారు.
'ఆయన కృపే కారణం'
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యాఖ్యానించింది. రథయాత్రతో ట్రంప్‌నకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. 'ఇది కచ్చితంగా జగన్నాథుడి కృపే. 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ను రక్షించింది' అని ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ పేర్కొన్నారు. 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ఉచితంగా తన ట్రైన్ యార్డ్‌ను ఇచ్చి సహకరించారని గుర్తు చేసుకున్నారు.