Donald Trump Accepts Republican Party's Nomination : యూఎస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం లాంఛనంగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను ఆమోదించారు. నిజమైన విశ్వాసం, బలం, ఆశలతో కూడిన సందేశంతో పార్టీ ప్రతినిధులు, ప్రజల ముందు నిలబడతానని ఈ సంద్భరంగా ఆయన అన్నారు. మరో నాలుగు నెలల్లో కచ్చితంగా అద్భుత విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విఫలం చెందే ప్రసక్తే లేదని, అమెరికా స్వర్ణయుగానికి చేరువలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తనపై హత్యాయత్నం జరిగిన తరువాత అమెరికా ప్రజలు చూపిన ప్రేమకు, మద్దతకు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. తన సంకల్పం చాలా దృఢమైనదని, అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించేదుకు తాను కట్టుబడి ఉన్నాని ట్రంప్ తెలిపారు. గురువారం మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో మూడోసారి అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను అధికారికంగా ఆమోదించిన తరువాత ఆయన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
"నేను మీ మద్దతును, భాగస్వామ్యాన్ని, మీ ఓటును వినయంగా అడుగుతున్నాను. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకోవడానికి కృషి చేస్తాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచను."
- డొనాల్డ్ ట్రంప్
పునరాలోచనలో బైడెన్
ఓ వైపు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దూసుకుపోతుండగా, మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి వైదొలగాలని జో బైడెన్‌పై బాగా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సొంత పార్టీ నేతలు ఈ విషయాన్ని వెల్లడించగా, తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయానని, కనుక పోటీపై కచ్చితంగా పునరాలోచించుకోవాలని ఒబామా తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్‌పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను బైడెన్ ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ రాసింది. బైడెన్ కనుక అధ్యక్ష రేసులో కొనసాగితే ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
బైడెన్ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేదీ, లేనిదీ అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన కొవిడ్-19తో బాధపడుతూ, తన నివాసంలోనే చికిత్స తీసుకుంటున్నారు.
మళ్లీ ఈయూ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉర్సులా వాన్ డెర్
బైడెన్‌కు బెదిరింపులు - ఫ్లోరిడాకు చెందిన నిందితుడు అరెస్ట్!