China Earthquake Today : చైనాను భారీ భూకంపం కుదిపేసింది. వాయవ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున రిక్టర్‌స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల ధాటికి పలు భవనాలు కంపించాయి. ఈ భూకంపం వల్ల ఆరుగురికి గాయాలయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 120 భవనాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
దిల్లీలో ప్రకంపనలు
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. సుమారు 200 మంది రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్రంగా, మిగతా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో 47 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 78 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రం వుషీ కౌంటీలోని ఓ టౌన్‌షిప్ పరిధిలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. తర్వాత 5.3 తీవ్రతతో పలుమార్లు భూమి కంపించినట్లు వివరించింది. భూకంప కేంద్రం చైనా, కిర్గిజిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో దిల్లీలోనూ ప్రకంపనలు వచ్చాయి.
అయితే దాదాపు నెల రోజుల క్రితం (2023 డిసెంబర్) ఇదే వాయవ్య చైనాలో భారీ భూకంపం సంభవించింది. గ్యాన్సూ, చింగ్‌హాయ్ ప్రావిన్సుల్లో ఈ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. 87 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. 15 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 2 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం వల్ల దాదాపు 1.45 లక్షల మంది ప్రభావితులయ్యారు.
కొండచరియలు విరిగిపడి 11మంది మృతి
జనవరి 22న చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 11 మంది మరణించారు. ఈ ఘటన బీజింగ్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5:51 గంటలకు ఝాటోంగ్ నగరంలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలు జీవిస్తున్నాయని 18 ఇళ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. సుమారు 40 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యల్లో 200 మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొంటున్నారు. దాదాపు 500 మంది లియాంగ్‌షుయ్ గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.