Black Man Died By Us Police Officer : అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ తరహా ఉదంతం మరొకటి జరిగింది. ఒహియోలో రాష్ట్రంలో ఫ్రాంక్ టైసన్ అనే నల్లజాతీయుడు, అక్కడి పోలీసుల కర్కశత్వానికి బలైపోయాడు. ఓ కేసులో నల్లజాతీయుడిని అరెస్టు చేసే క్రమంలో అతని మెడపై ఓ పోలీసు కాలి నొక్కి పెట్టడం వల్ల ఊపిరాడక చనిపోయాడు. ఇందుకు సంబంధించిన పోలీసు బాడీ-కెమెరా ఫుటేజీని అక్కడి అధికారులు విడుదల చేశారు.
ఏప్రిల్ 18న కారులో వెళుతున్న టైసన్ అనే వ్యక్తి తూర్పు కాంటన్‌లో ఓ యుటిలిటీ పోల్‌ను ఢీ కొట్టాడు. అనంతరం బార్‌కు వెళ్లాడు. టైసన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు టైసన్ మెడపై కాలితో నొక్కి పెట్టి అతని చేతులను వెనక్కి లాగి సంకెళ్లు వేశారు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని టైసన్ పదే పదే చెప్పినా, ఆ పోలీసు వినిపించుకోలేదు. ఈ క్రమంలో టైసన్ అచేతనంగా ఉండిపోయాడు. తర్వాత పోలీసులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టైసన్ ఆస్పత్రిలో మరణించాడు.
24 సంవత్సరాల జైలు శిక్ష
ఇక ఇప్పటికే ఓ కిడ్నాప్, దొంగతనం కేసులో ఫ్రాంక్ టైసన్ 24 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ఏప్రిల్ 6న జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే టైసన్ తన పేరోల్‌కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫ్రాంక్ టైసన్ మరణంపై కాంటన్ మేయర్ విలయం షెరర్2 స్పందిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. 'ఫ్రాంక్ టైసన్ కుటుంబానికి వ్యక్తిగతంగా తన సానుభూతిని తెలియజేస్తున్నా. టైసన్ మరణానికి సంబంధించిన బాడీక్యామ్ ఫుటేజీని విడుదల చేశాం. ప్రస్తుతం సవాలుతో కూడిన సమయంలో వీలైనంత పారదర్శకంగా ఉండటమే నా లక్ష్యం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు' అని మేయర్ విలయం షెరర్ తెలిపారు. గతంలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు ఇలాగే ప్రాణాలు కోల్పోగా అమెరికా పోలీసుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగింది. జార్జ్ మరణానికి కారణమైన పోలీసు అధికారిని కోర్టు కఠిన శిక్ష విధించింది.