Anura Dissanayake On Foreign Policy : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే అనుర కుమార దిసనాయకే పొరుగు దేశాలతో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనాల మధ్య తాము నలిగిపోదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. అసలు ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురికావాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విదేశాంగ విధానంపై తన వైఖరిని తెలియజేశారు.
'వాటికి శ్రీలంక దూరం'
భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకోనే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని అనుర కుమార దిసనాయకే స్పష్టం చేశారు. తాము ఓ వర్గం పక్షం వహించమని తేల్చిచెప్పారు. భారత్-చైనాతో సంబంధాలను నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకొంటూ వెళ్లాలని నిర్ణయించిందని వెల్లడించారు.
'శాండ్ విచ్లా నలిగిపోవాలనుకోవడం లేదు'
"భౌగోళిక రాజకీయ యుద్ధంలో మేము పోటీదారులం కాదు. భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య భాగస్వామి కాబోము. వీటిల్లో శాండ్‌విచ్ వలే శ్రీలంక నలిగిపోవాలనుకోవడం లేదు. ముఖ్యంగా భారత్-చైనా మధ్య ఇబ్బంది పడాలని అనుకోవడంలేదు. ఇరు దేశాలు మాకు విలువైన మిత్రులే. ఎన్పీపీ ప్రభుత్వ హయాంలో మా స్నేహం మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను. అదే సమయంలో ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాం."
- అనుర కుమార దిసనాయకే, శ్రీలంక అధ్యక్షుడు
'ప్రపంచ శక్తుల ఆధిపత్య పోరుకు శ్రీలంక దూరం'
మరోవైపు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ శ్రీలంక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ వైఖరి చాలా కీలకమని అనుర కుమార దిసనాయకే వ్యాఖ్యానించారు. ప్రపంచ శక్తుల అధిపత్య పోరుకు శ్రీలంక దూరమని వెల్లడించారు. అదే సమయంలో ఉభయ పక్షాలకు ప్రయోజనకరంగా ఉండేలా దౌత్య, భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపై తాము దృష్టిపెడతామని తెలిపారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం
ఇటీవల శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే విజయం సాధించారు. ఈ క్రమంలో శ్రీలంక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయసూర్య దేశ 9వ అధ్యక్షుడిగా దిసనాయకేతో సోమవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష సచివాలయం వేదికైంది. అనంతరం దిసనాయకే జాతినుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా, ప్రజాతీర్పును గౌరవిస్తూ అధికార మార్పిడి శాంతియుతంగా సాగేందుకు సహకరించిన మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు దిసనాయకే కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే ప్రమాణ స్వీకారం - DISSANAYAKE SWEARING IN