Alexei Navalny Mother Putin : తన కుమారుడి మృతదేహాన్ని వెంటనే అప్పగించాలని రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ తల్లి లియుడ్మిలా పుతిన్‌ను వేడుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం పుతిన్ దగ్గరే ఉందని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోను అలెక్సీ నావల్నీ చెందిన టెలిగ్రామ్‌లో ఛానల్‌లో పోస్టు చేశారు. చివరి సారి తన కుమారుడిని చూసేందుకు మృతదేహాన్ని వెంటనే అప్పగించాలని వేడుకున్నారు.
తన కుమారుడు మృతదేహం ఎక్కడో ఉందో కూడా అధికారులు చెప్పడం లేదని నావల్నీ తల్లి వాపోయారు. మృతదేహాన్ని అప్పగిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే అలెక్సీ మృతదేహాన్ని 14 రోజుల వరకు అప్పగించే అవకాశం లేదని నావల్నీ అవినీతి నిరోధక ఫౌండేషన్ డైరెక్టర్ తెలిపారు. కెమికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యేందుకు 14 రోజుల సమయం పడుతుందని ఓ దర్యాప్తు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.
కాగా ఈ ఆరోపణలను క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు. నావల్నీ మరణంపై అంతర్జాతీయ విచారణకు 'ఈయూ' విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ పిలుపునివ్వగా అటువంటి డిమాండ్‌కు అంగీకరించబోమని పెస్కోవ్ తేల్చిచెప్పారు. మరోవైపు, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరుతూ 60 వేల మందికిపైగా ప్రజలు ప్రభుత్వానికి అభ్యర్థనలు సమర్పించారని 'ఓవీడీ- ఇన్ఫో' అనే హక్కుల సంస్థ తెలిపింది.
అలెక్సీ నావల్నీ మరణం
Navalny Death News : రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ పార్టీ నేత అలెక్సీ నావల్నీ కొన్నాళ్ల క్రితం కారాగారంలో మరణించారు. ఉదయపు నడక తర్వాత నావల్నీ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు రష్యాలోని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ వెల్లడించింది. చికిత్స కోసం అంబులెన్స్ వచ్చినా అప్పటికే నావల్నీ మరణించినట్లు తెలిపింది. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో నావల్నీ మరణం చర్చనీయాంశంగా మారింది.
పుతిన్‌పై పోటీ చేసి గుర్తింపు
రష్యాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నేతగా నావల్నీకి పేరుంది. ముఖ్యంగా రష్యా ప్రభుత్వం, పుతిన్‌కు వ్యతిరేకంగా చేసిన ఆందోళనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా నావల్నీ గుర్తింపు పొందారు. రష్యాలో ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టిన నావల్నీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
'నా భర్తను పుతినే చంపేశారు'- 'అమెరికాలో నేనూ నావల్నీ లాంటోడినే!'
తల్లి వద్దకు చేరని నావల్నీ మృతదేహం- రెండోసారి శవపరీక్షలు- అంతా కావాలనే!