Yoga For Constipation : మలబద్ధకం సమస్య చాలా అసౌకర్యం కలిగిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థతో సహా మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది. ప్రేగుల కదలికలు మెరుగ్గా లేనప్పుడు పూర్తి ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. కేవలం శారీరక సమస్యలే కాదు, మలబద్ధకం, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే వారు మానసికంగా కూడా దెబ్బతింటారనీ, డిప్రెషన్లోకి వెళతారనీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను నయం చేసుకోవడానికి మార్కెట్లో దొరికే మెడిసిన్ల కన్నా యోగాసనాలు ఉత్తమం అని అంటున్నారు నిపుణులు. మీ పేగుల కదలికలను మెరుగు చేసి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించే కొన్ని యోగాసనాలు మీ కోసం.
1. ఆపానాసనం
మోకాళ్ల నుంచి ఛాతి వరకు చేసే ఆసనాన్ని ఆపానాసనం అంటారు. నేలపై వెల్లకిలా పడుకుని, మోకాళ్లను ఛాతి వరకు తీసుకురావాలి. మోకాళ్లను ఛాతిపై ఉంచి చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఇలా 15సెకన్ల పాటు ఉండాలి. ఇలా వరుసగా ఆరుసార్లు చేయడం వల్ల పేగుల కదలికలు మెరగవడమే కాక, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. రుతుస్రావంలో వచ్చే తిమ్మిర్లు తగ్గుతాయి.
2. పశ్చిమోత్తనాసనం
యోగాసనాల్లో అతి ముఖ్యమైనది పశ్చిమోత్తనాసనం. నేలపై కాళ్లు చాపుకుని కూర్చుని శరీరంలోని వెనుక భాగం అంటే వీపును లేపి ముందుకు అంటే కాళ్ల మడమల వరకు వంచాలి. ఈ భంగిమ, వెనుక కండరాలను సాగదీయడం సహా ఉదక అవయవాలను మసాజ్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
3. భుజంగాసనం
నాగుపాము భంగిమలా కనిపించేదే భుజంగాసనం. దీన్నే కోబ్రా పోజ్ అని కూడా పిలుస్తారు. నేలపై బోర్లా పడుకుని అరచేతులపై భారం వేసి ఛాతిని పైకి లేపాలి. ఇది ఉదర కండరాలను బలపరచడమే కాక, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
4. మలాసనం
పాదాలను నేలపై ఉంచి, మోకాళ్లను వెడల్పు చేసి, రెండు చేతులు జోడించి కూర్చోవడాన్నే మలాసనం అంటారు. దీన్నే గార్లాండ్ పోజ్ అని పిలుస్తారు. ఈ భంగిమ తుంటి భాగాన్ని తెరవడానికి సహాయపడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగుల కదలికలను సులభతరం చేస్తుంది.
5. మార్జర్యాసనం
దీన్నే పిల్లి-ఆవు భంగిమ అని పిలుస్తారు. అరచేతులు, మోకాళ్లతో నేలపై పిల్లిలా ఉండాలి. ఊపిరి బాగా పీల్చుకుని నడుమును ఆవులా పైకి ఎత్తాలి. తర్వాత గాలిని బయటకు వదులుతూ నడుమును కిందకు వంచాలి. ఇలా 5 నుంచి 10సార్లు చేయడం వల్ల జీర్ణ అవయవాలను చక్కగా మసాజ్ అవుతుంది. పేగుల కదలికలు మృదువుగా మారతాయి. దీంతో పాటు వెన్నుముకపై ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపిస్తుందట.
ఇవే కాకుండా సుప్త మత్స్యేంద్రాసనం, ధనురాసనం, పవనముక్తాసనం, ఉత్తనాసనం, సేతు బంధాసనం వంటివి రోజూ చేయడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ సమస్యలు పారిపోతాయని యోగా నిపుణులు చెబుతున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బాబోయ్ ఎండలు! నీరు తగినంత తాగుతున్నారా? డీహైడ్రేషన్‌ను గుర్తించడమెలా? - Symptoms Of Dehydration