Why do Women Need More Sleep than Men : సగటున ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవాలి. కానీ, ఓ పరిశోధనలో ఎవరు ఎంతసేపు నిద్రపోవాలనేది వయసు ఆధారంగానే కాకుండా.. జెండర్ మీద ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది. దీని ప్రకారం.. పురుషుల కంటే మహిళలకు కొంచెం ఎక్కువ నిద్ర అవసరమని తేలింది. ఇంతకీ, మగవారి కంటే ఆడవారికి ఎంత సేపు ఎక్కువ నిద్ర అవసరం? కారణాలేంటి? సరైన నిద్ర(Sleep) కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
2014లో స్లీప్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మహిళలకు సగటున 7 గంటల 40 నిమిషాల నిద్ర అవసరం కాగా, పురుషులకు 7 గంటల 20 నిమిషాల నిద్ర అవసరమని తేలింది. అంటే ఈ అధ్యయనం ప్రకారం.. పురుషుల కంటే స్త్రీలకు దాదాపు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని స్పష్టమైంది. సుమారు 40 సంవత్సరాలు నిండిన 2,100 మంది పురుషులు, మహిళలపై అధ్యయనం చేశారు. మరి మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలిపేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ : మగవారి కంటే ఆడవారు నిద్రలేమిని అనుభవించే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే వారు పురుషుల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడే అవకాశం ఉంటుందట. ఈ పరిస్థితుల కారణంగా మహిళలకు కంటి నిండా నిద్రపట్టే అవకాశం తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి రాత్రిపూట మహిళలు ఎక్కువగా నిద్రపోయేలా చూసుకోవడం మంచిది అంటున్నారు.
హార్మోన్ల మార్పులు : మహిళల్లో హార్మోన్ల మార్పులు సహజం. మహిళల హార్మోన్లు నెలవారీగా, జీవితాంతం మారుతూ ఉంటాయి. ఈ మార్పులు నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా నిద్ర పోవాల్సిన అవసరం వస్తుంది.
పీరియడ్స్ : చాలా మంది మహిళలు పీరియడ్స్ టైమ్‌లో నొప్పి, తిమ్మిర్లు, అసౌకర్యం కారణంగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. రుతుచక్రంలోని వివిధ స్టేజెస్‌లో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు ఛేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మార్పులు కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు.
అర్ధరాత్రి దాకా నిద్రపోవట్లేదా?
గర్భం : మహిళలు గర్భధారణ సమయంలో రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్‌ను ఎదుర్కొంటారు. ఈ కారణంగా వారు తరచుగా డిప్రెషన్, స్లీప్ అప్నియా, నొప్పి, కాళ్లలో అన్‌ప్లెజెంట్ సెన్సేషన్ వంటి వాటిని అనుభవిస్తారు. ఇవన్నీ వారి నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ప్రసవించిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. ఇది పగటిపూట నిద్రపోవడాన్ని పెంచి.. రాత్రి పూట నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
మెనోపాజ్ : మోనోపాజ్ అంటే మహిళలకు పీరియడ్స్ శాశ్వతంగా ఆగిపోయే స్టేజ్. ఈ టైమ్‌లో సాధారణంగా 85 శాతం మంది మహిళలు వేడి ఆవిర్లు అనుభవిస్తారు. అంటే.. ఉన్నట్టుండి తీవ్రమైన వేడిని ఫీల్ అవుతారు. తరచుగా చెమటలు పడతాయి. దీనివల్ల వారి నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఇది పేలవమైన నిద్ర, పగటిపూట అలసటకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
సరైన నిద్ర పొందడానికి జాగ్రత్తలు :
- పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నప్పటికీ, చాలా మంది రాత్రి సమయంలో తగినంత నిద్రపోరు. అయితే, మీరు తగినంత నిద్రపోతున్నారో లేదో తెలుసుకోవడానికి ఉదయం నిద్ర లేవగానే మీకు ఎలా అనిపిస్తుందో గమనించాలి.
- మీకు నిద్ర పట్టడంలో సమస్య ఉంటే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, డైలీ ఒకే టైమ్‌కు నిద్రపోవడం, పడుకునే ప్రదేశాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోవడం వంటి జీవనశైలి మార్పులు ఫాలో అవ్వాలి.
- అలాగే నిద్రకు ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలను యూజ్ చేయకూడదు. బెడ్‌రూమ్ చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.
- అయినా, నిద్ర సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
టీనేజర్లకు 9గంటల నిద్ర మస్ట్- మిగతా వయసు వాళ్లు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?