How to Control Sweet Cravings: ఏదైనా వేడుకలప్పుడు స్వీట్లను తినడం అందరికీ సాధారణమే. కానీ.. కొందరు నిత్యం స్వీట్లు తింటూనే ఉంటారు. కోరికను అదుపులో పెట్టుకోవాలని అనుకున్నా.. ఆగలేకపోతుంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో.. ఇలాంటి స్వీట్ క్రేవింగ్స్‌ను ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నారు.
"తీపి పదార్థాలను తినకుండా ఉండలేకపోవడాన్ని సమస్య అనడం కంటే ఓ అలవాటుగా చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది చికెన్‌ను ఇష్టపడితే, మరికొందరు ఐస్‌క్రీమ్‌లు, ఇంకొందరు చాక్లెట్లూ వంటి పదార్థాలను అతిగా తింటుంటారు. రుచి, సువాసన, టెంపరేచర్, టెక్స్చర్స్, క్రంచీలను సెన్సోరియల్ ఆట్రిబ్యూట్స్ అంటారు. వీటిని జ్ఞానేంద్రియాలు గ్రహించడం వల్ల తినాలనే కోరిక మనలో కలుగుతుంది. అచ్చం అలానే మీరు కూడా స్వీట్లు తినడాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో కాఫీ, టీ, మద్యపానంలాంటి వ్యసనంగా మారే ఛాన్స్ ఉంటుంది."
- డాక్టర్ జానకీ శ్రీనాథ్, పోషకాహార నిపుణురాలు
ఇలా నియంత్రించండి..
స్వీట్ల నుంచి దృష్టి ఎలా మరల్చాలి అనే విషయమే డాక్టర్ జానకీ శ్రీనాథ్ కొన్ని సలహాలను ఇస్తున్నారు. జీవనశైలి యాంత్రికంగా మారడం వల్ల అందరిలోనూ ఒత్తిడి సహజమైన విషయంగా మారిపోయిందని డాక్టర్ చెబుతున్నారు. ఒకప్పుడు ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సంగీతం వినడమో, ఆరుబయట నడకకు వెళ్లడమో చేసేవారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కూడా లేకపోవడంతో చాలా మంది ఒత్తిడిలో స్వీటో, ఐస్‌క్రీమో తినేస్తున్నారని అంటున్నారు. చాలా మంది తమకు తెలియకుండానే ఇలా స్వీట్ల మాయలో పడిపోతున్నారని చెబుతున్నారు. అందుకే ఇలా చేయాలని పలు సూచనలు చేస్తున్నారు...
- ముందుగా ఇంటికి స్వీట్లు తెచ్చిపెట్టుకోవడం మానేయాలి.
- ఒకవేళ ఇంట్లో స్వీట్లు ఉన్నా.. ఎదురుగా కనిపించకుండా పెట్టుకోవాలి.
- తీపి రుచి చూడాలనే కోరిక ఆగకపోతే.. స్వీట్‌ను ముక్కలు చేసి, అందులోంచి చిన్న ముక్క చేసి తినండి. మిగిలింది ఇతరులకు ఇవ్వండి.
- గులాబ్‌జామ్, మోతీచూర్ లడ్డూ లాంటి ఎక్కువ పాకం ఉన్న స్వీట్లు కాకుండా.. రసమలై, బొరుగుల ఉండ, రాజ్‌గిరా చిక్కీ వంటివి తినండి.
- రాగి, నువ్వుల లడ్డూలు, తక్కువ తీపితో చేసే ప్లెయిన్ కస్టర్డ్, జెల్లీలాంటి స్వీట్లను తయారు చేసుకుని తినండి.
- ఇవే కాకుండా తక్కువ మొత్తంలో డ్రైఫ్రూట్స్‌ని కూడా ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.
- ఈ అలవాట్లను అనుసరించడం వల్ల మీరు ఎక్కువగా స్వీట్లు తినడం తగ్గించుకోవచ్చు అని డాక్టర్ జానకీ శ్రీనాథ్ వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అవాంఛిత రోమాలకు కారణాలు ఇవేనట - ఇలా చేస్తే ఈజీగా తొలగించుకోవచ్చట! - Unwanted Hair on Face Reason
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, డైలీ ఈ డైట్ పాటించాలట - ICMR కీలక సూచనలు! - ICMR Dietary Guidelines