Which Time Diabetes Patient Exercise : మధుమేహం సమస్య ఉన్నవారికి వ్యాయామం ఉత్తమ రక్షణా మార్గంగా చెప్పచ్చు. సాధారణంగా డయాబెటిస్ పేషంట్లు ఆహారంలో మార్పులతో పాటు వైద్యుల సలహా వేరకు కొన్ని మందులు తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు వారు ప్రతిరోజూ శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు.
శారీరక శ్రమ అంటే రోజూవారీ పనులు మాత్రమే కాదు, వ్యాయామం లాంటివి చేయడం వల్ల మధుమేహం ప్రమాదకర వ్యాధిగా మారకుండా ఉంటుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి వ్యాయామం చాలా అవసరం. కానీ అది ఏ సమయంలో చేయాలనేది కూడా ముఖ్యమైన అంశం అని చెబుతున్నారు నిపుణులు. షుగర్ పేషెంట్లు ఏ సమయంలో వ్యాయామం చేస్తే మంచిది? చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు మెరుగైన వ్యాయామం ఏదైనా ఉందా అనే విషయాలను తెలుసుకుందాం.
ఏ సమయంలో వ్యాయామం చేయాలి?
టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వారు రోజులో ఏ సమయంలోనైనా ఎలాంటి వ్యాయామం అయినా చేయచ్చని అంతా అంటుంటారు. కానీ ఇటీవల అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం శారీరక శ్రమ రక్తంలో గ్లూకోజ్ ను తగ్గించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజంగా గడిచిపోయాక అంటే రాత్రి భోజనం తర్వాత. ఇతర అధ్యయనాల్లో కూడా తెలిసిన విషయం ఏంటంటే రాత్రి భోజనం తర్వాత వ్యాయామం చేయడం వల్ల తిన్న తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగకుండా, నియంత్రణలో ఉంటాయి.
రాత్రి తిన్న తర్వాత వర్కౌట్ చేయలేనివారు భోజనానికి ముందు కూడా శారీరక శ్రమలో పాల్గొనవచ్చు. అది కూడా కుదరని డయాబెటిక్ పేషెంట్లు మధ్యాహ్నం భోజనానికి ముందు లేదా తర్వాత కూడా వ్యాయామం చేయచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం చాలా అవసరం. అయితే ఎక్సర్సైజ్ కోసం మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరం మాత్రం లేదు. తక్కువ సమయంలోనే అంటే రోజు మొత్తంలో 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేసి రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా మెరుగుపరుచుకున్న వారు చాలా మంది ఉన్నారు.
మధుమేహం ఉన్నవారికి ఏ వ్యాయామం మంచిది?
షుగర్ వ్యాధిని నియంత్రించడానికి మంచి వ్యాయామం ఇదే అంటూ ప్రత్యేకమైనది ఏదీ లేదు. కేవలం కార్డియో ఎక్సర్సైజెస్, బలాన్నిచ్చే వ్యాయామాలు, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్లు మాత్రం డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతుంటారు. ఈ మూడు పూర్తి ఆరోగ్యాన్ని కాపాడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు, శరీర బరువును నియంత్రించేందకు, కండరాల ద్రవ్యరాశికి సహాయపడతాయి. ఇవన్నీ శరీరంలో గ్లూకోజ్ స్లాయిలను అదుపులో ఉంచేందుకు దోహదపడతాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.