Walking 20000 Steps a Day Benefits: మీరు రోజు వాకింగ్ చేస్తున్నారా? మీలో చాలా మందికి రోజుకు 10వేల అడుగులు వేయాలని తెలుసు. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సైతం వెల్లడించారు. అయితే, రోజు 20వేల అడుగులు వేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? బరువు తగ్గడం నుంచి నిద్ర వరకు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. European Journal of Preventive Cardiology అధ్యయనం ప్రకారం.. గుండె సమస్యల బారిన పడి మరణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తేలింది. The association between daily step count and all-cause and cardiovascular mortality: a meta-analysis అనే అధ్యయనంలో పోలండ్‌లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ Maciej Banach పాల్గొన్నారు. వయసు, జాతి, లింగం తేడా లేకుండా ఎవరైనా సరే.. 20వేల అడుగులు వేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారని వివరించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గుండె ఆరోగ్యం: వాకింగ్ చేయడం అనేది అద్భుతమైన ఎయిరోబిక్ వ్యాయామం అని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందన్నారు. ఇంకా అధిక రక్తపోటును తగ్గించి.. రక్త సరఫరాను మెరుగుపరుస్తుందని తెలిపారు.
బరువు తగ్గడం: వాకింగ్ చేయడం వల్ల కేలరీలు కరుగుతాయని.. 20వేల అడుగుల నడవడం వల్ల 500-1000 కేలరీలు కరుగుతాయని వివరించారు. ఇది బరువు తగ్గడానికి, అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. నడిచే వేగం, ప్రాంతం, దూరాన్ని బట్టి కేలరీల కరుగుదలలో తేడా ఉంటుందని పేర్కొన్నారు.
చక్కర స్థాయుల నిర్వహణ: సాధారణంగా మనం చేసే వాకింగ్ లాంటి వ్యాయామం వల్ల ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడించారు. ఇది రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచి.. టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుందని వివరించారు. భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయని అంటున్నారు.
ఏకాగ్రత పెరుగుతుంది: వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా మానసిక ప్రశాంతతను ఇచ్చే ఎండార్ఫిన్ హార్మోన్స్ విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఒత్తిడి తగ్గి చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు.
ఒంటరితనాన్ని తగ్గిస్తుంది: వాకింగ్ చేయడం వల్ల ఒంటరితనం నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందని వివరించారు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎక్కువ దూరం వాకింగ్ చేయడం వల్ల కొందరిలో కండరాలు పట్టేసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సరైన విశ్రాంతి, పౌష్టికాహారం అవసరమని వివరించారు. ఇంకా సరైన ఫుట్‌వేర్ ధరించాలని.. హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక నొప్పులు, గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. అయితే, ఒకేసారి 20వేల అడుగులు కాకుండా కొద్దికొద్దిగా ప్రారంభించాలని సూచిస్తున్నారు. మొదటగా రోజుకు 10వేల అడుగులు వేసిన తర్వాత 20వేల అడుగులపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. ఇవి సుమారు 16కిలోమీటర్ల దూరానికి సమానమని.. అలా అనీ ఈ మొత్తం దూరాన్ని ఒకేసారి నడవకూడదని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు 6-6-6 రూల్ తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే గుండె సమస్యలు అసలే రావట!
మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? నడకతో ప్రయోజనాలు తెలిస్తే షాక్!