Symptoms of Calcium Deficiency: మానవ శరీరం బాగుండాలంటే కాల్షియం తప్పనిసరి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారికి కాల్షియం చాలా అవసరం. ఎముకలు బలంగా ఉండాలన్నా, గుండెతో సహా కండరాల సంకోచాలను నియంత్రించాలన్నా, దంతాలు దృఢంగా ఉండాలన్నా, నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా... అన్నింటికీ కాల్షియం అవసరం. అంతే కాకుండా హార్మోన్ల ఉత్పత్తిలో, కణాల సిగ్నలింగ్ వ్యవస్థలో, ఎంజైముల పనితీరులో కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో ఎప్పుడైతే కాల్షియం తగ్గుతుందో.. అది కొన్ని లక్షణాల ద్వారా మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుందని నిపుణులు అంటున్నారు. అవి ఏంటంటే..
కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు:
తిమ్మిర్లు: కండరాల పని తీరుకు కాల్షియం కీలకమైనది. కాల్షియం స్థాయిలు తక్కువగా ఉంటే కండరాలు సరిగా పనిచేయవని నిపుణులు అంటున్నారు. నీరసంగా అనిపించడం, అలాగే ఏదైనా పని చేస్తున్నప్పుడే కాదు, విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా కాళ్లు, పాదాలు, చేతుల్లోని కండరాలలో తిమ్మిరిగా అనిపించవచ్చని చెబుతున్నారు.
ఒళ్లు జలదరింపు: కాలుష్యం తగ్గడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. లక్షణాలు చూస్తే.. శరీరం జలదరించినట్టు, వేళ్లు, కాళ్లు, పెదవులు, నాలుక వంటి భాగాల చివర సూదులతో పొడిచినట్టు అనిపిస్తుందని చెబుతున్నారు.
గోళ్లు విరిగిపోవడం: వేలి గోళ్లు కూడా మన ఆరోగ్యాన్ని సూచిస్తాయని.. కాల్షియం స్థాయిలను గోళ్ల ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే గోళ్లు పెళుసుగా మారిపోతాయని, గోళ్ల చివర్లు విరిగిపోతూ, చీలిపోతూ ఉంటాయని చెబుతున్నారు.
దంతక్షయం: కాల్షియం అనేది దంతాల ఎనామెల్‌లో ముఖ్యమైన భాగం. ఇది దంతాల పై పొరను రక్షిస్తూ ఉంటుంది. కాల్షియం తగినంత అందకపోతే ఎనామిల్ బలహీనపడుతుందని.. దంత క్షయం వంటి సమస్యలు వస్తాయని, దంతాలు త్వరగా ఊడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పార్కిన్సన్స్ వ్యాధి: శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే పార్కిన్సన్స్ వ్యాధి వస్తుందని నిపుణులు అంటున్నారు. 2019లో "Neurology" జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కాల్షియం లోపం ఉన్న వ్యక్తులలో పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బోస్టన్ లోని బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్(Brigham and Women's Hospital) పని చేస్తున్న Dr. Alexandra C. Goncalves పాల్గొన్నారు. కాల్షియం లోపంతో బాధపడుతున్న వ్యక్తులు పార్కిన్సన్స్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు కనుగొన్నారు.
కీళ్లనొప్పులు: బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలు కోసం కాల్షియం చాలా కీలకం. దీర్ఘకాలికంగా కాల్షియం లోపిస్తే ఎముక బలహీనంగా మారుతుందని.. దీనివల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చని చెబుతున్నారు.
గుండె దడ: గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే విద్యుత్ ప్రేరణలను నియంత్రించే శక్తి కాల్షియంకి ఉంది. కాల్షియం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు గుండె లయలో అంతరాయాలు ఏర్పడతాయని.. దీనిని కార్డియాక్ అరిథ్మియా అని పిలుస్తారని నిపుణులు అంటున్నారు. లక్షణాలు చూస్తే గుండె దడ రావడం, హృదయ స్పందనలు క్రమ రహితంగా ఉండడం, ఛాతీలో కాస్త నొప్పి రావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు.
కాల్షియం కోసం ఏం తినాలి?: కాల్షియం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను ప్రతిరోజూ తినాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పాలు, పెరుగు, చీజ్ వంటివి తింటూ ఉండాలని.. అలాగే పాలకూర, కాలే వంటి ఆకుకూరలను తింటూ ఉండాలన్నారు. బాదం, సోయా ఉత్పత్తులు, టోపు, పనీర్ వంటివి తినాలని.. అలాగే, సాల్మన్, సార్డినెస్ వంటి చేపలు కూడా తింటూ ఉండాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.