Premature Gray Hair Causes : ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే జుట్టు తెల్లగా మారేది. కానీ.. ప్రస్తుతం 30 సంవత్సరాల్లోనే వైట్ హెయిర్(Hair) ప్రాబ్లమ్ వేధిస్తోంది. దీంతో చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు నలుపు రంగు కలర్ వేసుకుంటూ మేనేజ్ చేస్తున్నారు. మరి.. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలేంటి? దీనిని తగ్గించుకునే పరిష్కార మార్గాలేంటి? వైద్యులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి.. బాడీలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. వయసు పెరుగుతున్నకొద్దీ ఇది క్రమంగా తగ్గిపోవడం సహజం. కానీ.. కొన్ని కారణాలతో కొంతమందిలో మెలనిన్ ముందుగానే తగ్గిపోతుంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం అవుతున్నాయని అంటున్నారు.
"యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా"లో.. డెర్మటాలజీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ టేలర్ ఈ సమస్యను విశ్లేషించారు. మెలనిన్ లోపించడం కారణంగానే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. సాధారణంగా వయసు పైబడే కొద్దీ జుట్టుకు రంగును ఇచ్చే సామర్థ్యాన్ని మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు(మెలనోసైట్లు) తగ్గిపోతాయని టేలర్ చెప్పారు. కొందరు చిన్న వయసులోనే జుట్ట నెరిసే సమస్యను ఫేస్ చేయడానికి గల కారణాలను టేలర్ వివరించారు.
కొన్ని ఆరోగ్య సమస్యలు వంశపారంపర్యంగా వచ్చినట్టే.. జుట్టు నెరవడమనే సమస్య కూడా వంశపారంపర్యంగా రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా.. మితిమీరిన మద్యపానం, ధూమపానం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా రావొచ్చట. ఎందుకంటే.. ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి దారి తీస్తాయని.. ఫలితంగా జుట్టు త్వరగా తెల్ల బడటానికి చాన్స్ ఉందని టేలర్ చెప్పారు.
అలాగే విటమిన్ బి12 లోపం, అనీమియా, థైరాయిడ్, ఒత్తిడి.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారిలోనూ ఈ సమస్య త్వరగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. "జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ(2014)" నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఒత్తిడి అనేది మెలనోసైట్ల ఉత్పత్తిని తగ్గిస్తుందని కనుగొన్నారు. ఫలితంగా.. చిన్న వయసులోనే స్ట్రెస్ కారణంగా తెల్ల జుట్టు రావొచ్చని పరిశోధకులు తెలిపారు.
జుట్టు విపరీతంగా రాలుతోందా? తినే ఫుడ్లో ఇది లోపించడమే కారణమట!
డాక్టర్ టేలర్ ప్రకారం.. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చట. ముఖ్యంగా ప్రొటీన్ లోపం లేకుండా చూసుకోవాలంటున్నారు. అలాగే రాగి, ఐరన్, విటమిన్ B12, బయోటిన్, జింక్, సెలీనియం వంటి పోషకాలను డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఒత్తిడి తలెత్తకుండా డైలీ వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ధూమపానం, మద్యపానానికి వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇవన్నీ చేసినా తెల్ల జుట్టు ఇబ్బందిపెడుతుంటే.. సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.