Weight Loss Tips With Rice Eating : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును కష్టపడకుండా తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో ఒకటి అన్నం తినకపోవడం. మరి.. వెయిట్‌లాస్ అవ్వాలంటే అన్నం పూర్తిగా మానేయాలా? నిపుణులు ఏమంటున్నారు? అన్నది చూద్దాం.
రైస్ తినడం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారనేది కేవలం అపోహ మాత్రమే అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. రైస్‌లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు, పిండిపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందించడంతో పాటు, ఆరోగ్యంగా ఉంచుతాయని అంటున్నారు. కాబట్టి.. అన్నం తినడం మానొద్దని సూచిస్తున్నారు. బరువు తగ్గాలని అనుకుంటే.. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
అన్నంతో సమానంగా కూర :
బరువు తగ్గాలనుకునేవారు భోజనంలో అన్నంతోపాటు కూర సమానంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల అన్నం తినటం తగ్గుతుంది. రైస్ తక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో క్యాలరీలు పెరగవు. అలాగే.. కూరలు, పప్పులలో ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయని సూచిస్తున్నారు.
చిన్నప్లేట్లను ఉపయోగించండి :
భోజనం చేస్తున్నప్పుడు చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ఎందుకంటే.. తక్కువ భోజనంతోనే ఈ ప్లేట్లు నిండిపోతాయి. దానివల్ల ఎక్కువ తింటున్నామనే భావన మనసుకు కలుగుతుంది. తద్వారా మరింత భోజనం చేయకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
సలాడ్స్ తినండి :
బరువు తగ్గాలనుకునే వారు డైట్‌లో ప్రతిరోజూ సలాడ్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటంతోపాటు ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో ఎంతో మేలు చేస్తాయని నిపుణులంటున్నారు. దీనివల్ల రైస్ తక్కువగా తింటామని చెబుతున్నారు. 2016లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బరువు తగ్గాలనుకునే వారు రోజూ సలాడ్ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ బ్రెండా పెన్' పాల్గొన్నారు. బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో సలాడ్‌ను భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
మజ్జిగ తీసుకోండి : వెయిట్‌లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నవారు రోజూ మజ్జిగ తీసుకోవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. మజ్జిగలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ సంఖ్యలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని నిపుణులంటున్నారు. అలాగే ఆహారం తినేముందు ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల అన్నం తక్కువ తినే అవకాశం ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారని నిపుణులంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లల్లో దంత సమస్యలా? ఈ టిప్స్ క్యావిటీస్, ఇన్ఫెక్షన్లు నుంచి రిలీఫ్! - Child Dental Care Tips
డైలీ ఒక అరటి పండు తినాలంటున్న నిపుణులు - ఎందుకో తెలుసా? - Benefits Of Eating Banana