Health Benefits Of Walnuts : నేటి టెక్నాలజీ యుగంలో బిజీ లైఫ్ వల్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య భార్యభర్తలను ఎన్నోరకాలుగా ఒత్తిడికి గురిచేస్తుంది. మానసికంగా కుంగదీస్తుంది. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.. సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతే మనసులో ఏదో వెలితి. కోపం, నిస్సహాయత, ఆత్మన్యూనత, ఆవేదన వంటి భావోద్వేగాలు మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సంతాన లేమి సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, చాలా మంది ఈ విషయంలో మహిళలను తప్పుబడుతుంటారు.
కానీ, మహిళ గర్భం దాల్చకపోవడానికి పురుషుల్లో ఉండే కొన్ని సమస్యలు కూడా కారణమవుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీర్య కణాల సంఖ్య తగ్గటం, ఆరోగ్యకరంగా లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు వంటివి సంతానరాహిత్యానికి దారి తీస్తాయంటున్నారు. కాబట్టి, మీరూ(పురుషులు) ఈ సమస్యల కారణంగా సంతానలేమితో ఇబ్బందిపడుతున్నట్లయితే.. మీ డైలీ డైట్లో "వాల్నట్స్"(Walnuts) భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవి తినడం ద్వారా మీ సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడడమే కాకుండా.. సంతానప్రాప్తి కలుగుతుందంటున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అచ్చంగా మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్(ఆక్రోట్స్)లో వృక్ష సంబంధ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్, పీచు, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా వీటిని తినడం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో తలెత్తే సంతాన సమస్యలన్ని తగ్గించడంలో ఆక్రోట్లలో ఉండే పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. రోజూ ఆక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
అలర్ట్ : థైరాయిడ్ ఉంటే గర్భం ధరించలేరా? - వైద్యులు ఏమంటున్నారో తెలుసా!
2012లో "ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. 3 నెలల పాటు రోజుకు 75 గ్రాముల ఆక్రోట్లు తిన్న పురుషులలో వీర్య కణాల సంఖ్య, కదలిక, రూపం గణనీయంగా మెరుగుపడినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని లోమా లిండా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అబ్బాస్ షాహీ పాల్గొన్నారు. డైలీ ఆక్రోట్లు తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సమస్యలకు దివ్య ఔషధం : రోజుకు నాలుగు ఆక్రోట్లు తినడం వల్ల సంతాన లేమి సమస్యలు దూరమవ్వడమే కాకుండా మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు దండిగా ఉండే ఆక్రోట్లు.. క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండెజబ్బుల వంటి ఎన్నెన్నో సమస్యలు దరిజేరకుండా కాపాడతాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆక్రోట్లు వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా చేస్తాయి. తరచూ తినే వారి ముఖంపై చారలు, ముడతలు కనిపించవని చెబుతున్నారు. అంతేకాదు.. నిద్రలేమి, ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలకు ఆక్రోట్లు మంచి ఔషధంగా పని చేస్తాయని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.