Types Of Friends You Should Avoid : ఆపదలో అవసరాన్ని, బాధలో మనసును తెలుసుకుని సహాయపడే వాడే నిజమైన స్నేహితుడు. జీవితంలో ఎదురైన కష్టాలు, బాధలు, అవమానాలు వంటివి తల్లిదండ్రులు, బంధువులతో పంచుకోలేనప్పుడు.. స్నేహితులతోనే చెప్పుకుంటారు. అయితే.. కొందరు మిత్రులు సరదాలు, సంతోషాల్లో మాత్రమే భాగం పంచుకుంటారు. అవసరం వచ్చినప్పుడు తప్పించుకు తిరుగుతారు. ఇంతేకాదు.. మరికొన్ని లక్షణాలున్న ఫ్రెండ్స్ కూడా మీ వెంట ఉంటారు. ఇలాంటి వారితో ఫ్రెండ్‌షిప్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా చాలా నష్టం జరుగుతుందని చెబుతున్నారు. మరి.. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎగతాళి చేసేవారు :
ప్రతి మనిషిలో కొన్ని లోపాలుంటాయి. శత్రువులు వాటిని హైలైట్ చేస్తూ.. ఎగతాళి చేస్తుంటారు. కానీ.. స్నేహితులు మాత్రం తమ మిత్రుడిలోని లోపాలను ఎత్తి చూపరు. ఎగతాళి చేయరు. వాటిని ఎలా సరిచేసుకోవాలో సూచిస్తారు. మద్దతుగా నిలుస్తారు. ఇలా కాకుండా మీ స్నేహితులలో ఎవరైనా మిమ్మల్ని ప్రతిసారీ ఎగతాళి చేస్తుంటే.. మీ లోపాలని చూసి వెక్కిరిస్తుంటే.. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే.. వారితో స్నేహానికి గుడ్‌బై చెప్పడమే మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే.. వారి ఎగతాళి కారణంగా మీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, మీరు తీవ్ర ఒత్తిడి, ఆందోళన ఫేస్ చేయాల్సి రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యానికి నెయ్యి ఎంత మేలు- మరి చర్మం సంగతేంటి? అందం తగ్గిస్తుందా? - Is Ghee Good For Skin
అసూయ పడేవారు :
నిజమైన స్నేహితులు.. మనం విజయం సాధిస్తే వాళ్లు సంబరాలు చేసుకుంటారు. మనకన్నా ఎక్కువగా ఆనందిస్తారు. కానీ.. కొంత మంది స్నేహితులు మనం విజయం సాధిస్తే అసూయ పడుతుంటారు. ఇలాంటి వారు అవసరమైతే చాటుగా మన విజయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తారట. కాబట్టి.. మన విజయాల్ని చూసి పైకి నవ్వుతూ మాట్లాడి.. లోపల కుళ్లుకునే వారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
రంగులు మారిస్తే :
కొంతమంది స్నేహితులు మనతో అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా.. అవసరం తీరినప్పుడు మరొకలాగా ప్రవర్తిస్తుంటారు. ఇలా.. అవసరానికి రంగులు మార్చే వారు మీ ఫ్రెండ్ లిస్టులో ఉంటే.. వారికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే వారి వల్ల మనకు జరిగే మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
వెనకాల మాట్లాడేవారు :
నిజమైన స్నేహితులు మనం ఏదైనా తప్పు చేస్తే మన ముందే మాట్లాడుతారు. మనతోనే నేరుగా చర్చిస్తారు. కానీ.. కొందరు మాత్రం మన గురించి.. వెనకాల వేరే వారితో తక్కువ చేసి మాట్లాడుతారు. మన సీక్రెట్స్ తీసుకెళ్లి వారికి చెప్పేస్తుంటారు. ఇలా.. ఒకరి సిక్రెట్స్ మరొకరికి చెప్పి గొడవలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇలాంటి శాడిజం ఉన్న వారితో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మన రహస్యాలు ఏవీ తెలియకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఇది చేయాలంటే వారికి దూరంగా ఉంటేనే సాధ్యమని అంటున్నారు.
కష్టాల్లో వదిలేసి పోయేవారు :
స్నేహితులంటే ఆనందంలోనే కాదు.. బాధలోనూ పక్కన ఉండాలి. కానీ.. కొందరు మిత్రులు వారికి కష్టాలొచ్చినప్పుడు మన సహాయం తీసుకుంటారు. మనకు సమస్య వచ్చినప్పుడు కనిపించకుండా పోతారు. ఇలాంటి వారు నడి సముద్రంలో ఒంటరిగా మనల్ని వదిలేసిపోతారు. కాబట్టి.. ఇలాంటి వారిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని సూచిస్తున్నారు.
చివరగా.. జీవితంలో ఒక మంచి కుటుంబం, ఉద్యోగం, ఇళ్లు వంటివి నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో.. కనీసం ఒకరిద్దరైనా నిజమైన మిత్రులను సంపాదించుకోవడం అంతే అవసరం. ఇది జరగాలంటే.. ఏం చేయాలో తెలుసా? "నీకు ప్రాణమిచ్చే మిత్రుడు కావాలంటే.. ముందు నువ్వు ప్రాణమివ్వడానికి సిద్ధంగా ఉండాలి" అని నిపుణులు సూచిస్తున్నారు.
మీ నెయిల్స్ తరచూ విరుగుతున్నాయా? - ఇలా చేశారంటే ఆ ప్రాబ్లమ్ రాదు! - Nails Breakage Prevent Tips