Tips to Avoid Curd Getting Sour in Summer : ఇంట్లో ఎన్ని రకాల కూరలు వండినా సరే.. భోజనంలో చివరిగా పెరుగు వేసుకుని తింటేనే తృప్తిగా ఉంటుందని చాలా మంది అంటుంటారు. అంతలా పెరుగు మన ఆహారంలో భాగమైపోయింది. ఇక వేసవి కాలంలో అయితే దాదాపు అందరూ తప్పకుండా భోజనంలో పెరుగు, మజ్జిగను తీసుకుంటారు. రోజూ పెరుగు తినడం వల్ల శరీరం చల్లబడటంతో పాటు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే, ఈ సమ్మర్‌లో మనం మార్కెట్ నుంచి పెరుగు ప్యాకెట్ కొని తీసుకువచ్చినా లేదా ఇంట్లో పెరుగు తోడు పెట్టినా సరే అది తొందరగా పుల్లగా మారుతుంది. పెరుగు పుల్లగా ఉంటే తినాలని అనిపించదు. అయితే, ఇలా పెరుగు పుల్లగా మారకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులంటున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎండాకాలంలో ఇంట్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఆహార పదార్థాలు తొందరగా పాడవుతుంటాయి. అందులో పెరుగు ఒకటి. అయితే, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, తేమ ఉన్న ప్రదేశాలలో తోడుపెట్టిన పాలలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల పెరుగు తొందరగా పుల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, పెరుగును తోడు పెట్టి కొద్దిగా చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టాలని సూచిస్తున్నారు. పెరుగు గడ్డగా మారిన తర్వాత ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలని అంటున్నారు. అలాగే పెరుగు చిక్కగా, రుచిగా ఉండాలంటే తోడు పెట్టేటప్పుడు ఒక ఎండు మిర్చి వేస్తే సరిపోతుంది. దీంతో పెరుగు గడ్డగా వస్తుంది. మరికొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి..
- పెరుగు చిక్కగా, రుచిగా ఉండాలంటే కొవ్వు తీయని పాలను ఉపయోగించాలి. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగు తోడు వేయాలి.
- అలాగే గిన్నెలోకి తోడు పూర్తిగా కలిసేటట్టు తప్పకుండా కలపాలి.
- అయితే తోడుకోసం బాగా పుల్లగా ఉండే పెరుగును కూడా ఉపయోగించకూడదు.
- వీలైనంత వరకు స్టీలు గిన్నెలో కన్నా మట్టి పాత్రల్లో పెరుగు తోడేయండి. ఇలా చేయడం వల్ల పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది.
- అలాగే మాడిన పాలను పెరుగు కోసం తోడు పెట్టడం వల్ల అది వాసన వస్తుంది. కాబట్టి, పాలు మాడకుండా చూసుకోవాలి.
- కొంత మంది పెరుగును పగలు తోడు పెడుతుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల పెరుగు గడ్డగా మారకుండా నీళ్లలా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నైట్ టైమ్‌లో పెరుగు తోడు పెట్టేలా చూసుకోవాలి.