Hoarseness Can Cause Throat Cancer : మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు గొంతు బొంగురు పోవటం, నొప్పి పుట్టడం, గొంతులో మంట, సరిగా మాట్లాడలేకపోవటం.. వంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాతావరణంలో మార్పులు, పడని పదార్థాలు తీసుకోవడం, గొంతులో ఇన్ఫెక్షన్స్ ఏర్పడినప్పుడు ఈ సమస్యలు వస్తుంటాయి. అయితే.. తక్కువ కాలంలోనే తొలగిపోతాయి. అలాకాకుండా.. ఈ గొంతు సమస్యలు రోజుల తరబడి వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. అది గొంతు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చంటున్నారు.
స్వరపేటిక క్యాన్సర్ వేధిస్తుంటే.. మాట తీరు పూర్తిగా మారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. మాట సన్నగా, గుసగుసలాడినట్టుగా కూడా వస్తుందంటున్నారు. ఇది చివరికి స్వరతంత్రులు దెబ్బతినేలా కూడా చేయొచ్చు అంటున్నారు. కాబట్టి.. జలుబు వంటి లక్షణాలేవీ లేకపోయినా వారాల తరబడి గొంతు బొంగురు తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. పొగ తాగే అలవాటు ఉన్న వారికిది మరింత ముఖ్యమంటున్నారు.
2005లో 'జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. రెండు వారాల కంటే ఎక్కువగా గొంతు నొప్పి లేదా బొంగురు వంటి లక్షణాలు ఉంటే అది గొంతు క్యాన్సర్ ప్రారంభ హెచ్చరిక కావచ్చొని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ జాన్ డి. షిఫ్మన్ పాల్గొన్నారు. గొంతు బొంగురు లేదా నొప్పి వారాల తరబడీ ఉంటే అది గొంతు క్యాన్సర్ సంకేతం కావొచ్చని ఆయన పేర్కొన్నారు.
అలర్ట్ : పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ - ఇవి చెక్ చేసుకోండి! - Lung Cancer Causes in Non Smokers
గొంతు సమస్యలు తగ్గించుకోండిలా :
తగినంత వాటర్ : గొంతు బొంగురు పోయినా, నస పెడుతున్నట్టు అనిపించినా వీలైనంత వరకూ మాట్లాడకుండా చూసుకోవటం బెటర్. అలాగే తగినంత వాటర్ తాగాలి. ఇది స్వరతంత్రులను తడిగా ఉంచుతూ మాట సాఫీగా వచ్చేలా చేస్తుందంటున్నారు నిపుణులు.
పొగ తాగొద్దు : పొగాకు సంబంధిత ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. ఇవి నోరు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు.
మద్యంతో జాగ్రత్త : అలాగే మద్యానికి వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ఒంట్లో నీటి శాతం తగ్గిస్తుంది. అలాగే స్వరతంత్రుల మీదా విపరీత ప్రభావం చూపుతుందంటున్నారు.
ఛాతిమంట తగ్గించుకోవాలి : గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకు రావటం వల్ల ఛాతిమంటతో బాధపడేవారు నిపుణులను కలిసి తగు వైద్యం చేయించుకోవాలంటున్నారు.
విశ్రాంతి ఇవ్వాలి : గట్టిగా, ఎక్కువసేపు మాట్లాడినప్పుడు ఆరోజుకు గొంతుకు కాస్త విశ్రాంతి ఇవ్వటం మంచిది అంటున్నారు నిపుణులు. దీంతో గొంతు బొంగురుపోవటం తగ్గుతుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.