These Foods not to Preserve in Fridge : ఈ ఉరుకులు - పరుగుల జీవితంలో ఎప్పటికప్పుడు మార్కెట్‌కు వెళ్లి తాజా కూరగాయలు, పండ్లు తెచ్చుకుని తినడం అంత తేలికైన పని కాదు. అందుకే మనకు కావాల్సిన వాటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని, ఫ్రిజ్‌లో భద్రపరచుకుని అవసరమైనప్పుడు వాడుకుంటుంటాం. రాత్రి మిగిలిపోయిన అన్నం, కూరలు మొదలుకుని, వారాంతంలో వాడుకునే కూరగాయల దాకా ప్రతీదీ అందులోనే పెట్టేస్తుంటాం. కొందరైతే కిచెన్‌లో ఉంచాల్సిన వస్తువులన్నింటినీ రిఫ్రిజిరేటర్‌లో నింపేస్తుంటారు. అక్కడైతే ఎక్కువ కాలం పాడవకుండా, తాజాగా ఉంటాయని అలా చేస్తుంటారు. అయితే అది తప్పని చెబుతున్నారు నిపుణులు. ఫ్రిజ్‌లో ఖాళీ ప్లేస్ చాలా ఉంది కదా అని ఏదిపడితే అది పెడితే, మొదటికే మోసం వస్తుందంటున్నారు. ముఖ్యంగా ఈ 12 వస్తువులను అందులో పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు.
అరటి పండ్లు : అరటి పండ్లను మార్కెట్ నుంచి తేగానే చాలా మంది వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదట. సాధారణ గది ఉష్ణోగ్రతల వద్దే అరటి పండ్లను ఉంచడం మంచిదట. వెచ్చని ఉష్ణోగ్రతలు పండు పక్వానికి సహాయపడతాయని, అలాకాక రిఫ్రిజరేటర్‌లో పెట్టడం వల్ల పండు గట్టిపడటమే కాక రుచిని కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు.
టమాటలు : టమాటలను అందరూ ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల వారమంతా అవి పాడవకుండా ఫ్రెష్‌గా, నిగనిగలాడుతూ ఉంటాయని అలా చేస్తుంటారు. అయితే.. ఒకట్రెండు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే పర్వాలేదు కానీ ఎక్కువ కాలం ఉంచకూడదట. దీనివల్ల టమాటలు సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయట. సుదీర్ఘ కాలం రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన టమాటలు లోపలంతా మెత్తగా మారిపోతాయట. అలాంటి వాటిని మనం ఆహారంగా తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయలు : ఉల్లిపాయలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. వాటిని సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవాలి.
అల్లం - వెల్లుల్లి : అల్లం - వెల్లుల్లి పాయలు ఫ్రిజ్‌లో ఉంచితే ఇతర పదార్థాల రుచినీ, వాసనను ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా త్వరగా మొలకలు వస్తాయి. అందుకే వీటిని బయట ఉంచితేనే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
బంగాళాదుంపలు : ఫ్రిజ్‌లో వీటిని అస్సలు ఉంచకూడదు. ఒకవేళ పెడితే వీటిల్లోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. వాటిని వేపినప్పుడు చక్కెర్లు ప్రమాదకర రసాయనాలుగా మారతాయి.
బ్రెడ్ : బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పెళుసుగా మారి ముందుగానే పాడవుతుంది. దీన్ని పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. లేదంటే బ్రెడ్ బ్యాగుల్లో పెడితే గడువు తేదీ వరకూ తాజాగా ఉంటుంది.
నూనె : ఆలివ్, కొబ్బరి, ఇతర వంట నూనెలు వంటివి ఫ్రిజ్‌లో త్వరగా ఘనీభవిస్తాయి. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
పుచ్చకాయలు : పుచ్చకాయలను కొనుగోలు చేసినప్పుడు వాటిని నేరుగా ఫ్రిజ్‌లో స్టోర్ చేయకూడదట. దానిని ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెడితే ముప్పు లేదని చెబుతున్నారు.
అవకాడో : అవకాడోలనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిని సాధారణ షెల్ఫ్‌లలో పెట్టుకుంటే సరిపోతుందట.
కాఫీ : ఫ్రిజ్‌లో నిల్వ చేసిన కాఫీ దాని చుట్టూ ఉన్న ఇతర రుచులను తీసుకునే అవకాశం ఉందట. బదులుగా ఎండ తగలకుండా ఉండే ప్రదేశంలో పెట్టుకుంటే చాలని చెబుతున్నారు.
వీటితో పాటు తేనె, తాజా మూలికలను రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయకూడదని చెబుతున్నారు. సో చూశారుగా. పైన చెప్పిన ఈ వస్తువులను మీ ఫ్రిజ్‌కు దూరంగా ఉంచండి.
అల్లం త్వరగా పాడవుతుందా? - ఇలా స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్‌గా ఉండడం పక్కా!
హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? డిన్నర్ టైమ్‌లో ఈ టిప్స్ పాటిస్తే బెస్ట్ అంటున్న నిపుణులు!