Diabetes Control Food : సైలెంట్ కిల్లర్‌గా చెప్పుకొనే మధుమేహ వ్యాధి పేరు వినగానే వ్యాయామం, డైట్ కంట్రోలింగ్ గుర్తుకొస్తుంది. వ్యాయామం పెద్దగా అవసరం లేకుండానే ఆహారంలో మార్పుల ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని డైటీషియన్లు చెప్తున్నారు. రోజువారి ఆహారంలో స్వల్ప మార్పులతో రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచవచ్చని పేర్కొంటున్నారు. సమతుల ఆహారం, సాధారణ శారీరక శ్రమ రక్తంలో చక్కెర స్థాయిలని నిర్దేశిస్తాయి. దినచర్యలో భాగంగా తెల్లవారుజామున సూపర్‌ఫుడ్ తీసుకోవడం మధుమేహం రక్షణలో కీలకంగా ఉంటుందని సూచిస్తున్నారు. షుగర్ బాధితుల్లో చాలా మంది పలు రకాల రసాలతోపాటు నానబెట్టిన గింజలను ఆహారంగా తీసుకుంటున్నారు. నానబెట్టిన గింజల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పొంచి ఉన్న తరుణంలో ఇంట్లో తయారు చేసుకునే రసాలు మేలని నిపుణులు చెప్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించాలి. నిద్రలేచిన గంటలోగా ఏదైనా ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ ఆహార పదార్థాలు ఉపయోగించాలి. అల్పాహారంలో సాధారణ పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. మధుమేహం నివారణకు పలు రసాలు సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తున్నట్లు వైద్యుల పరిశోధనల్లో తేలింది.
అధిక వ్యాయామంతో గుండెపోటు!- ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరే - HEART ATTACK SYMPTOMS
కాకరకాయ రసం చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది. ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పాలీపెప్టైడ్-పి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కాకరకాయ రసం సహాయపడుతుంది. దీనిలోని విసిన్, లెక్టిన్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. గ్లూకోజ్ నెమ్మదిగా వినియోగించడానికి దారి తీస్తుంది.
వంటగదిలోని పోపుల డబ్బాలో ఉండే మెంతి గింజలు డయాబెటిక్ నియంత్రణకు ఉపకరిస్తాయి. విత్తనాలలో కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన మెంతి గింజలను ఉదయం భోజనంలో చేర్చుకోవడం వల్ల గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది. మెంతులు ఆకలిని తగ్గించడంతో పాటు బరువును నియంత్రిస్తాయి. మెంతులు మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహ బాధితుల్లో గుండె జబ్బులు తలెత్తకుండా మెంతి గింజలు ఔషధంలా పనిచేస్తాయి.
ఉసిరి కాయ. దీన్ని ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా అంటారు. విటమిన్ సి పవర్‌హౌస్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఉసిరికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఉసిరి రసం లేదా తాజా ఉసిరికాయను ఉదయాన్నే తీసుకోవడం మధుమేహం నివారణకు సమర్థవంతమైన వ్యూహం.
వంటల్లో ఉపయోగించే పసుపు మధుమేహం నియంత్రణలో దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలకు ప్రసిద్ధి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో పసుపు చక్కగా సహాయపడుతుందని పరిశోధనలు వెల్లడించాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీరు, పాలలో చిటికెడు పసుపును కలుపుకుని తాగితే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది.
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేయడం ద్వారా మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది. దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి దాల్చినచెక్క సహాయపడుతుంది. టీలో చిటికెడు దాల్చినచెక్క పొడిని వేసుకుని తాగితే మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణగా ఉపయోగపడుతుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.