Squeezed Lemon Benefits : నిమ్మకాయతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. బిర్యాణీ, పులిహోర, చికెన్ వంటి వంట పదార్థాల నుంచీ స్నాక్స్, పండ్ల రసాల తయారీ వరకూ అన్నింటికీ నిమ్మకాయ రసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమైన విటమిన్-సీ నిమ్మకాయలో పుష్కలంగా ఉంటుంది. ఇది శారీరక ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం విషయంలోనూ చాలా ప్రయోజనాలు అందిస్తుంది.
ఇలా రకరకాలుగా ఉపయోగపడే నిమ్మకాయల నుంచి రసాన్ని పిండిన తర్వాత వాటిని తొక్కలను ఏం చేస్తున్నారు. ఏం చేస్తాం.. చెత్త డబ్బాలో వేస్తాం లేదా బయట పడేస్తాం అనుకుంటున్నారు కదా. అదే నిజమైతే మీరు చాలా మిస్ అవుతున్నట్లేనట. నిమ్మకాయ మాత్రమే కాదు తొక్కలు కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయట. క్లీనింగ్ నుంచి బ్యూటీ వరకూ నిమ్మకాయ తొక్కలతో కలిగే ప్రయోజనాలేంటో చూసేద్దాం రండి.
శుభ్రత కోసం!
నిమ్మకాయలు సహజ క్రిమిసంహారకాలు, డియోడరైజర్లు. మీ కిచెన్లో, ఇంటి బయట అపరిశుభ్రంగా ఉండే కొన్ని వస్తువులు, చోట్ల దగ్గర నిమ్మకాయ తొక్కలను ఉంచడం వల్ల క్రీములు నశించడంతో పాటు దుర్వాసన తొలగిపోతుంది. కటింగ్ బోర్డులు, డైనింగ్ టేబుల్,కిచెన్ కౌంటర్లను శుభ్రం చేయడానికి, చెత్త డబ్బాలో దుర్వాసన రాకుండా ఉండటానికి నిమ్మ తొక్కపై ఉప్పు చల్లి శుభ్రం చేయాలి.
మచ్చలు, మరకలు
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ సహజమైన బ్లీచ్‌గా పనిచేస్తుంది.అలాగే మనం పడేసే నిమ్మతొక్కలు టీ కప్పు, కాఫీ కప్పులను, ఇంట్లో నేల మీద ఇతర వస్తువుల మీద, మెటల్ సర్ఫెస్ల మీద ఉండే మచ్చలు, మరకలు తొలగించడానికి సహాయపడతాయి. ఇందుకు మీరు నిమ్మతొక్కను తీసుకుని మరక ఉన్న చోట రుద్దిలా.. కాసేపు అలా వదిలేసి కడిగితే సరిపోతుంది.
రిఫ్రిజిరేటర్ కోసం!
చాలా మందికి ఫ్రిజ్‌ను వాడటం తెలిసినప్పటికీ దాన్ని శుభ్రం చేయడం విషయంలో ఎన్నో సందేహాలు. ఫ్రిజ్ లో మనం పెట్టే రకరకాల పదార్థాల కారణంగా అదో రకమైన వాసన వస్తుంటుంది. నిజానికి రిఫ్రిజిరేటర్లో వచ్చే ఆ వాసన పోవాలంటే నిమ్మతొక్కలు పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. నిమ్మకాయను కట్ చేసి లేదా నిమ్మతొక్కలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచితే దుర్వాసన అంతా పోతుంది. నాలుగైదు రోజులకోసారి ఇలా చేశారంటే మీ రిఫ్రిరేజటర్ ఎప్పుడు సువాసన వెదజల్లుతుంటుంది.
స్టీల్ వస్తువులను!
మీరు తరచూ వాడే డిష్ వాషర్లో కాస్త నిమ్మరసం కలిసిందంటే మీ ఇంట్లోని స్టీల్ వస్తువులు తలతలా మెరిసి పోవడం ఖాయం. నిమ్మతొక్కలు, డిష్ వాషర్ కలిపి స్టీల్ వస్తువులను తొమడం వల్ల వాటిలోని హానికరమైన క్రీములు నశించి చక్కగా క్లీన్ అవుతాయి.
గార్డెనింగ్ లో!
మొక్కలను పెంచడానికి ఇష్టపడేవారు నిమ్మతొక్కలను చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీ గార్డెన్ లో మొక్కలకు నిమ్మతొక్కలను ఎరువుగా వేయడం వల్ల అవి పోషకాల గనిగా మారతాయి. మట్టిలోపల నిమ్మతొక్కలను పెట్టి ఉంచితే అవి త్వరగా ఎదుగుతాయి కూడా.
స్పా ట్రీట్మెంట్:
మీకు తెలియని విషయం ఏంటంటే? మీరు పడేస్తున్న నిమ్మతొక్కలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. హోం మేడ్ స్పా ట్రీట్మెంట్కు కూడా నిమ్మతొక్కలు బాగా పనికొస్తాయి. మీరు స్నానం చేసే నీటిలో నిమ్మతొక్కలను వేసి.. కాసేపటి తర్వాత స్నానం చేయడం చర్మం తాజాగా మారుతుంది. అలాగే నిమ్మతొక్కలతో చక్కెర, తేనె కలిపి రుద్దుకోవడం వల్ల చర్మం సహజంగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.