Aloe Vera Gel Benefits : మగువల సౌందర్య సంరక్షణకు కోసం మార్కెట్లో ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి. అయితే, ఇంట్లో సహజసిద్ధంగా లభించే వస్తువులు చర్మ ఆరోగ్యానికి మంచివి అంటున్నారు సౌందర్య నిపుణులు. అలాంటి వాటిలో కలబంద కూడా ఒకటి. జిడ్డుగా, పొడిగా, సున్నితమైన చర్ం ఇలా అన్ని రకాల చర్మతత్వాల వారికీ కలబంద మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కలబంద చర్మానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మెరిసే ముఖం మీ స్వంతం : మెరిసే ముఖం కోసం చిటికెడు పసుపు, ఒక చెంచాడు పాలు, కొంచెం రోజ్‌వాటర్, ఒక చెంచా తేనె పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమానికి కలబంద గుజ్జును యాడ్ చేసుకోవాలి ఆ తరువాత మరోసారి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం కాంతి వంతమవుతుందని సౌందర్య నిపుణలు సూచిస్తున్నారు.
జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి : మొటిమల సమస్య జిడ్డు చర్మతత్వం ఉన్నవారిలో మొటిమల సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటి వారు కలబంద ఆకుల్ని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మొటిమలపై ప్రభావం : అమ్మాయిలను ఎక్కువగా వేదించే సమస్య మొటిమలు, ఈ మెుటిమలు రావడంతో వారు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అవి వచ్చినా, అవి పోయాక వాటి మచ్చలు కనిపించినా వాళ్లలో ఆందోళన పెరుగుతుంది. వీటిని తగ్గించడంలో కలబందకు మించింది లేదంటారు సౌందర్య నిపుణులు. అలా మెటిమల సమస్య ఉన్నచోట కలబంద గుజ్జులో రెండు చుక్కల గులాబీనూనె కలిపి ముఖానికి రాయాలని నిపుణలు సూచిస్తున్నారు. అలా రాసిన తరువాత కాసేపు అలానే వదిలేస్తే సరి. చర్మానికి పోషణ అంది ఉపశమనం కలుగుతుందంటున్నారు సౌందర్య నిపుణులు.
ఆ మచ్చలు మాయం! : గాయాల వల్ల చర్మంపై ఏర్పడే మచ్చలను పోగొట్టడంలోనూ కలబంద గుజ్జు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం కలబంద గుజ్జులో కాస్త రోజ్‌వాటర్ వేసి బాగా కలపుకోవాలి. ఆ మిశ్రమాన్ని శరీరంపై ఉన్న మచ్చలపై అప్లై చేసి అలాగే 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణలు సూచిస్తున్నారు.
పొడి చర్మంపై : పొడి చర్మమైతేపొడి చర్మతత్వం ఉన్నవారి చర్మం నిర్జీవంగా కనిపిస్తుంటుంది. అందుకు కారణం చర్మంలో ఉండే తేమ శాతం తగ్గిపోవడమే అంటున్నారు నిపుణులు. మరి తేమ శాతాన్ని పెంచుకోవాలంటే కొద్దిగా కలబంద గుజ్జులో కొంచెం ఆలివ్ ఆయిల్‌ని వేసి మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంతో పాటుగా మెడకు రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
ట్యాన్‌కు చక్కని విరుగుడుగా : చర్మం మీద ఎండ పడి ట్యాన్ రావడం అనేది సర్వసాధారణం. ఈ నేపథ్యంలో కొంచెం కలబంద గుజ్జును తీసుకొని అందులో టీస్పూన్ చొప్పున పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని సమస్య ఉండే ప్రాంతంలో రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. దీనివల్ల కేవలం ట్యాన్ మాత్రమే కాదు, ముఖంపై వచ్చే మొటిమలు కూడా తగ్గిపోతాయంటున్నారు నిపుణలు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.