Side Effects of Sleeping with Jeans: జీన్స్.. ప్రస్తుత కాలంలో ఈ పదం తెలియని వారు ఉండరు. చిన్న పిల్లలు మొదలు సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ వీటిని వాడుతున్నారు. ఇదొక సింబల్ ఆఫ్ స్టైల్. అయితే.. కొందరు తెలిసీ తెలియకనో, లేదంటే బయట తిరిగీ తిరిగీ ఓపికలేకనో కానీ.. జీన్స్ ప్యాంట్‌తోనే నిద్రపోతుంటారు. కానీ.. ఇలా చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయని.. ఏకంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ : జీన్స్.. డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో తయారవుతుంది. త్వరగా చెమటను పీల్చుకునే స్వభావం ఈ మెటీరియల్‌కు ఉండదు. అందులోనూ స్కిన్ టైట్ జీన్స్ అయితే ఇక చెప్పే పనే లేదు. ఫలితంగా జననేంద్రియాల వద్ద చెమట అలాగే ఉండిపోతుంది. ఈ తేమతోనే గంటల తరబడి ఉండిపోవడం వల్ల.. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అవకాశం ఎక్కువ.
ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2018లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం టైట్ జీన్స్ ధరించిన వ్యక్తులలో ఫంగస్ పెరుగుదల గణనీయంగా ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని సావో పాలోలోని యూనివర్సిడేడ్ ఎస్టాడుల్ డి కాంపైనస్‌కు చెందిన డెర్మటాలజీస్ట్ డాక్టర్ Bianca Shan పాల్గొన్నారు.
చర్మంపై దద్దుర్లు: బిగుతైన దుస్తుల వల్ల ఆయా శరీర భాగాలకు గాలి ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో.. అక్కడి చర్మంపై దురద, దద్దుర్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయని చెబుతున్నారు. కాబట్టి.. సాధ్యమైనంత తక్కువ సమయం జీన్స్ ధరించేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కాలంతో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా వచ్చే వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు.
నిద్రకు అంతరాయం: సాధారణంగా నిద్రలోకి జారుకున్న కొన్ని గంటలకు శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే.. జీన్స్ ధరించి నిద్రపోయినప్పుడు గాలి ప్రసరణ సరిగ్గా జరగక బాడీ టెంపరేచర్ మరింత పెరుగుతుందని.. తద్వారా నిద్రకు అంతరాయం ఏర్పడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
తీవ్రమైన నెలసరి నొప్పి: జీన్స్ వంటి బిగుతైన దుస్తులు ధరించి నిద్ర పోవడం వల్ల గర్భాశయం, పొత్తి కడుపు, జననేంద్రియాలపై ఒత్తిడి పడుతుందని.. అలాగే ఆయా భాగాలకు రక్తప్రసరణ కూడా సాఫీగా సాగదని అంటున్నారు నిపుణులు. వీటన్నింటి కారణంగా నెలసరి సమయంలో నొప్పి మరింత తీవ్రమవుతుందని చెబుతున్నారు.
2018లో "పెయిన్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వదులుగా ఉండే దుస్తులు ధరించే మహిళల కంటే.. బిగుతైన దుస్తులు ధరించే మహిళలు నెలసరి నొప్పిని ఎక్కువగా అనుభవిస్తారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టర్కీలోని డోకుజ్ ఎటెలిక్ యూనివర్సిటీలో ఓబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ డెనిజ్ యిల్మాజ్ పాల్గొన్నారు.
జీర్ణ సమస్యలు: బిగుతైన దుస్తుల వల్ల నడుంనొప్పి, అలాగే కొంతమందికి కడుపు నొప్పి, అజీర్ణం, బ్లోటింగ్, కడుపుబ్బరం.. వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.
చూశారుగా.. జీన్స్ వేసుకుని పడుకోవడం వల్ల నష్టాలు. కాబట్టి పడుకునేటప్పుడైనా, ఇతర సమయాల్లో అయినా సాధ్యమైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులకు ప్రాధాన్యమివ్వడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అందం, ఆరోగ్యం కోసం - రాగులు తినడమే కాదు ఇలా తాగేయండి! - Finger Millets Health Benefits