Losing Weight Very Fast Side Effects : కొందరు వేగంగా బరువు తగ్గాలన్న లక్ష్యంతో తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా సేపు వ్యాయామాలు చేయడం, సామర్థ్యానికి మించి బరువులెత్తడం చేస్తుంటారు. దాంతోపాటు తిండి కూడా తగ్గించేస్తారు. దీనివల్ల హార్మోన్లలో తేడాలొస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్.. తదితర హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉంటుందంట. ఫలితంగా శారీరకంగా, మానసికంగా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవక్రియ రేటు మందగిస్తుంది : వేగంగా బరువు తగ్గే ప్రక్రియ మీ జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి రోజూ చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం కారణంగా జీవక్రియ రేటు మందగిస్తుంది. ఫలితంగా మెటబాలిజం దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
కండరాల నష్టం : వేగంగా బరువు తగ్గాలని కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. దీనివల్ల కొవ్వు తగ్గడం కంటే కండరాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందంటున్నారు. కండరాల పరిమాణం క్షీణించి.. ఎముకలు బలహీనపడిపోతాయంటున్నారు. అదే జరిగితే.. తేలికగా విరిగే అవకాశాలు ఎక్కువంటున్నారు.
పోషకాహార లోపం : మీరు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్‌లను అనుసరిస్తే.. అది మీ శరీరంలో పోషకాహారలోపానికి దారితీయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని కారణంగా శరీరం నీరసించడంతో పాటు తేమ స్థాయుల్ని కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువే! కాబట్టి పోషకాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేయకుండా.. సమతుల ఆహారం తీసుకునేలా ప్రణాళిక వేసుకొని దానిని ఫాలో కావడం మంచిది అంటున్నారు నిపుణులు.
బరువు తగ్గాలంటే - ఈ ఫుడ్ కాంబినేషన్స్ అస్సలు ముట్టుకోకండి! - Food Combinations Cause for Obesity
డిప్రెషన్ : వేగంగా బరువు తగ్గి స్లిమ్‌గా మారడం మిమ్మల్ని సంతోషపరచవచ్చు. కానీ, అది డిప్రెషన్ ప్రమాదాన్నిపెంచుతుందని ఒక అధ్యయనం కనుగొంది. 2005లో "Journal of Clinical Endocrinology and Metabolism" ప్రచురించిన నివేదిక ప్రకారం.. వేగంగా బరువు తగ్గడం వల్ల డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ పరిశోధనలో "యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్" ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ ఓ. హీర్డ్ పాల్గొన్నారు. వేగంగా బరువు తగ్గడం వల్ల యాంగ్జైటీ, ఆందోళన, స్ట్రెస్ వంటి మానసిక సమస్యలు ఎక్కువగా వేధించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది దీర్ఘకాలంలో గుండె, మెదడు సమస్యలకూ దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పిత్తాశయ రాళ్లు : మీరు బరువు తగ్గే క్రమంలో సరైన ఆహారం(ముఖ్యంగా తగినంత కొవ్వు) తీసుకోకపోతే గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇవి చాలా బాధాకరంగా ఉంటాయి. కాబట్టి వేగంగా బరువు తగ్గడం కంటే ఆరోగ్యకరంగా, నెమ్మదిగా వెయిట్ లాస్ అవ్వడం మంచిది అంటున్నారు నిపుణులు.
చర్మ సమస్యలు : మీరు వేగంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తుట్లయితే అది చర్మ సమస్యలకు సైతం దారితీసే ఛాన్స్ ఉందంటున్నారు. ముఖ్యంగా అనుకోకుండా ఎక్కువ మొత్తంలో బరువు తగ్గినప్పుడు చర్మం ముడతలు పడడం, సాగడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. అప్పుడు చర్మం వేలాడుతూ అందవిహీనంగా కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే స్కిన్‌పై అక్కడక్కడా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడే ఛాన్ ఉంటుందని చెబుతున్నారు.
ఇవేకాకుండా.. వేగంగా బరువు తగ్గడం వల్ల.. సరైన పోషకాహారం తీసుకొని కారణంగా జుట్టు రాలడం, రక్త హీనత, థైరాయిడ్ సమస్యలు, నిద్రలేమి, అలసట, రుచి మారడం వంటి ప్రాబ్లమ్స్ రావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.