Side Effects of Eating Snacks While Watching Tv: వీకెండ్స్‌తో సంబంధం లేకుండా నాన్‌వెజ్ తినడం.. ఒంటరిగా ఉండటం.. ఒక చేత్తో రిమోట్ పట్టుకుని.. మరో చేత్తో స్నాక్స్ తింటూ టీవీ చూడటం.. ఏ పనీ లేకపోయినా నిద్రను వాయిదా వేయడం.. ఇవి దాదాపుగా అందరూ చేస్తారు. అసలు వీటితో ఇబ్బందేమీ లేదని అనుకుంటారు. కానీ.. ఈ అలవాట్లు ఆరోగ్యానికి ముప్పు తెస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా టీవీ చూస్తూ స్నాక్స్ తింటే చాలా డేంజర్ అని అంటున్నారు. ఇంతకీ ఈ అలవాట్లు ఎలాంటి సమస్యలు తెస్తాయో ఇప్పుడు చూద్దాం..
నాన్‌వెజ్ తింటే: కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. వారంతో సంబంధం లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెనో, మటనో, చేపలో వండుకుని తింటూ ఉంటారు. అందులోనూ రకరకాల వెరైటీస్ చేసుకుని తింటుంటారు. అందులోనూ మాంసాహారం తింటే శరీరానికి ప్రొటీన్ పుష్కలంగా అందుతుందని బలంగా నమ్ముతారు. అయితే.. రెగ్యులర్‌గా నాన్‌వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాహారం తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఒంటరిగా ఉంటే: "సింగిల్ కింగులం", "సోలో బతుకే సో బెటర్" అంటూ పాటలు పాడుకుంటూ ఒంటరిగా ఉంటుంటారు చాలా మంది. నలుగురిలో కలవకుండా ఒంటరిగా బతుకీడుస్తుంటారు. అయితే.. ఇలా తమలో తామే ఉండటం వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కన్నా.. దీర్ఘకాలంలో కలిగే అనర్థాలే అధికమని నిపుణులు అంటున్నారు. పలు పరిశోధనల్లో సైతం ఇది నిజం అని తేలింది. మానసికంగా ముభావంగా ఉండటం వల్ల శారీరక సమస్యలూ తలెత్తుతాయి. హైబీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, అధిక బరువు, రోగనిరోధకశక్తి తగ్గడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని అంటున్నారు. సో.. సోలోగా ఉండకుండా.. పదిమందితో జాలీగా గడపమని సలహా ఇస్తున్నారు.
పెళ్లి తర్వాత మొటిమలు వస్తున్నాయా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి! - Tips To Reduce Pimples
నిద్ర మానుకుని: పని ఉన్న సమయంలో నిద్ర మానుకోవడం సహజమే. కానీ చాలా మంది పనిలేనప్పుడు కూడా అర్ధరాత్రి వరకు టీవీ, మొబైల్స్‌కు అంకితమవుతారు. ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు అంటున్నారు. గ్యాడ్జెట్లను పూర్తిగా పక్కనపెట్టి.. ఏడు గంటలు నిద్రపోవడం సర్వదా శ్రేయస్కరం అని సూచిస్తున్నారు నిపుణులు.
టీవీ చూస్తూ తినడం: టీవీ చూస్తూ.. చిత్రవిచిత్రంగా కూర్చుంటారు చాలా మంది. పైగా టీవీ చూస్తూనే తినడం అదో ప్యాషన్‌గా భావిస్తారు. ఇంకొందరు అయితే ఏకంగా పడుకుని టీవీ చూస్తూ తినడం మాత్రమే కాదు మంచినీళ్లు కూడా తాగుతుంటారు. అయితే ఇలా టీవీకి కళ్లు అప్పగించి భోజనానికి కూర్చుంటే తిండిపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని.. అయితే, అధికంగా తినడం.. లేదంటే సగానికే చేతులు కడుక్కోవడం చేయాల్సి వస్తుందని అంటున్నారు. దీనివల్ల సరైన మోతాదులో ఆహారం తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పలు సర్వేలు సైతం చెబుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే అది రోగనిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. అంతేకాకుండా గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణసమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.
2015లో జర్నల్ ఆఫ్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. టీవీ చూస్తూ తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు అధికమవుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికన్ పోషకాహార నిపుణురాలు, పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పోషకాహార శాస్త్రం అండ్ డైటెటిక్స్ విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ డొరోతీ ఎం. క్రాంప్ పాల్గొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.