Side Effects of Eating Calcium Carbide Ripen Mangoes: మామిడి పండ్లను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. మంచి రంగుతో నిగనిగలాడుతుంటే వాటిని కొనేందుకు, తినేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రంగు చూసి కొంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. మామిడిని మాగబెట్టే క్రమంలో మంచి రంగు కోసం వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలు వినియోగిస్తున్నారని.. వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో మాగబెట్టిన పండ్లనే కొనుగోలు చేయాలని, లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వారు పేర్కొంటున్నారు. కాల్షియం కార్బైడ్‌తో పండించిన పండ్లను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం..
మామిడిపండు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, అనేక ఇతర సూక్ష్మపోషకాలు ఉంటాయి. కానీ మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెడితే ఆరోగ్యానికి మేలు జగరడానికి బదులు కీడు జరిగే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. మామిడి వంటి పండ్ల పక్వం కోసం సాధారణంగా ఉపయోగించే కాల్షియం కార్బైడ్.. ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుందని.. ఇందులో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి హానికరమైన సమ్మేళనాలు ఉంటాయన్నారు. ఈ పదార్ధాలు శరీరంలోకి వెళితే మైకం, తరచుగా దాహం, చికాకు, బలహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు మింగడంలో ఇబ్బంది, వాంతులు, నోటి పూతలు వంటివి కూడా ఎదురవుతాయి. ఇతర దీర్ఘకాలికి సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అవి ఏంటంటే..
గుండె జబ్బులు: కాల్షియం కార్బైడ్ విషపూరితమైనదని.. ఇది కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, మైకం వంటి లక్షణాలను కలిగిస్తుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది శ్వాసకోశ వ్యవస్థ సమస్యలు, గుండె వైఫల్యం, మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాల్షియం కార్బైడ్ ఉపయోగించి మాగబెట్టిన పండ్లను తిన్న వారు తరచుగా గుండె జబ్బులకు గురవుతారని, ముఖ్యంగా గుండెపోటు, గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో భారతీయ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ కె.వి.రావు పాల్గొన్నారు. కాల్షియం కార్బైడ్‌లో ఉండే ఎసిటిలిన్ వాయువు గుండెపోటుకు కారణమయ్యే రక్త గడ్డకట్టడానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.
క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది: కొన్ని అధ్యయనాలు కాల్షియం కార్బైడ్ క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుందని, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తున్నాయి.
న్యూరోలాజికల్ సమస్యలు: కాల్షియం కార్బైడ్ ద్వారా పండిన మామిడి పండ్లు తింటే దీర్ఘకాలిక హైపోక్సియాను ప్రేరేపిస్తుంది. ఇది నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా తలనొప్పి, తల తిరగడం, అతి నిద్ర, జ్ఞాపకశక్తి కోల్పోవడం, సెర్రిబల్ ఎడెమా, కాళ్లు చేతులలో తిమ్మిరి, బలహీనత, రక్తపోటు తక్కువగా ఉండటం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అందుకే మామిడి పండ్లు తినడానకి ఓ గంట ముందే వాటిని నీటిలో ఉంచడం ద్వారా వాటి మీద ఉన్న అవశేషాలు, రసాయనాల ప్రభావం ఎంతో కొంత తగ్గుతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.