Side Effects of Drinking Juices on Empty Stomach: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. సమతుల ఆహారంలో పండ్లు కూడా భాగమే. పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ తాజా ఫ్రూట్స్ తినడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అయితే చాలా మంది పండ్లకు బదులుగా వాటిని జ్యూస్‌గా చేసుకుని తాగుతుంటారు. ఇలా తాగితే శరీరానికి వెంటనే ఎనర్జి వచ్చి.. అది బూస్టర్‌గా పని చేస్తుందని చాలా మంది అభిప్రాయం. అయితే జ్యూసులను పరగడుపున తాగడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువని నిపుణులు అంటున్నారు. ఖాళీ కడుపున జ్యూసులు తాగితే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జీర్ణ సమస్యలు: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కారణం.. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ మధ్య చాలా సేపు మన పొట్ట ఖాళీగా ఉండడమే అంటున్నారు. ముఖ్యంగా నారింజ, నిమ్మరసం ఖాళీ కడుపుతో తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. 2017లో "ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఖాళీ కడుపుతో పండ్ల రసం తాగిన వ్యక్తులు మలబద్ధకం సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ పోషకాహార పరిశోధకుడు, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డా. డేవిడ్ జె. లీ పాల్గొన్నారు. పండ్ల రసాల్లోని చక్కెర, ఫైబర్ మలబద్ధకానికి కారణమవుతాయని ఆయన పేర్కొన్నారు.
సమ్మర్‌లో చెరకు రసం తాగుతున్నారా ? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే! - Sugarcane Juice Benefits
రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు: పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేయడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ, పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. చక్కెర అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం కష్టతరం చేస్తుంది.
పోషకాల శోషణ తగ్గడం: ఖాళీ కడుపుతో జ్యూసులు తాగడం వల్ల శరీరం పోషకాలను సరిగ్గా శోషించుకోలేకపోతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఖాళీ కడుపుతో తాగినప్పుడు, పండ్ల రసం చిన్న పేగులకు వెళ్లకుండా నేరుగా పెద్ద పేగులకు వెళ్లే అవకాశం ఉందని.. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పోషకాలు శరీరం గ్రహించలేదని చెబుతున్నారు.
దంత ఆరోగ్యంపై ప్రభావం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల దంతాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. పండ్ల రసాలలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తాగితే అవి పళ్ల ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఇది కావిటీస్, దంతాల సున్నితత్వానికి దారితీస్తుంది.
ఆకలి పెరగడం: పండ్ల రసాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనిని ఖాళీ కడుపుతో తాగితే త్వరగా ఆకలి అవుతుంది. దీనివల్ల రోజంతా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.