Should Never Stop These Medications Suddenly : ఈరోజుల్లో ఎక్కువ మంది బీపీ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి డైలీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు. అయితే.. కొందరు బీపీ మెడిసిన్స్‌ను మధ్యలో ఆపేస్తుంటారు. కానీ.. అలా మానేయడం వల్ల ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, ఆప్టిక్ నరాలు దెబ్బతిని ప్రాణాల మీదకు రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
థైరాయిడ్ మందులు : ఈ మెడిసిన్స్ వాడే వారు కూడా సడన్‌గా మానేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు ఆకస్మికంగా మందులను ఆపివేస్తే "థైరాయిడ్ స్టోర్మ్" వచ్చే ప్రమాదం ఉందని.. ఇది ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. హృదయ స్పందన పెరిగి, జ్వరం, మూర్ఛ, కోమా వంటి పరిస్థితి వస్తుందట.
యాంటీ-డిప్రెసెంట్స్ : బ్రెయిన్ సమస్యలకు సంబంధించి యాంటిడిప్రెసెంట్స్ మెడిసిన్స్ వైద్యులు సూచిస్తుంటారు. కొందరు వ్యక్తులు.. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందినట్టు అనిపించగానే వాడడం మానేస్తుంటారు. కానీ, ఈ మందులను అకస్మాత్తుగా ఆపడం వలన మైకం, ఫ్లూ వంటి లక్షణాలతో పాటు కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ మెడిసిన్స్ వాడుతున్నవారు.. మధ్యలో ఆపకూడదని బ్రిటీష్ పరిశోధకులు సూచించారు.
బ్లడ్ థిన్నర్స్ : రక్తాన్ని పలుచగా చేయడానికి, గడ్డకట్టకుండా నిరోధించడానికి బ్లడ్ థిన్నర్స్ అనే యాంటీ కోయాగ్యులెంట్స్ డైలీ తీసుకుంటుంటారు కొందరు. ఇవి సాధారణంగా స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు వాడుతుంటారు. వీటిని తీసుకోవడం సడన్‌గా ఆపివేస్తే.. రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. దాంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యం బాగాలేక డాక్టర్‌ను కలుస్తున్నారా? ఈ విషయాలు మస్ట్‌గా చెప్పండి!
బెంజోడియాజిపైన్స్ : ఇవి మత్తుమందులు. ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పులకు చికిత్స కోసం వీటిని యూజ్ చేస్తుంటారు. వీటిని కూడా మధ్యలో మానేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ మందులను సడన్ ఆపేస్తే నిద్ర భంగం, తలనొప్పి, చిరాకు, ఆందోళన, భయాందోళనలు, చేతి వణుకు, చెమట, వికారం, దడ, కండరాల నొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట.
గ్లాకోమా కంటి చుక్కలు : కంటి లోపల ఒత్తిడిని తగ్గించడానికి వీటిని తీసుకుంటారు. అయితే, వీటిని అకస్మాత్తుగా ఆపడం వలన కంటిలోపల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఆప్టిక్ నరాలు దెబ్బతిని.. అంధత్వానికి దారితీయొచ్చట.
కార్టికో స్టెరాయిడ్స్ : చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వీటిని యూజ్ చేస్తుంటారు. ఈ మందులు వాడే వారు అకస్మాత్తుగా ఆపేస్తే.. శరీరానికి తగినంత కార్టిసాల్ ఉత్పత్తి చేయడానికి సమయం ఉండదు. ఫలితంగా మానసిక కల్లోలం, అలసట, కీళ్ల నొప్పులు, తక్కువ రక్తపోటు, వికారం, కడుపు నొప్పి, అతిసారం వంటి అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందట.
ఇవేకాకుండా.. యాంటీబయాటిక్స్, ఓపియాయిడ్స్, గబాపెంటిన్ వంటి మెడిసిన్స్ వాడే వారు కూడా మధ్యలో మానేస్తే.. ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. సంబంధిత వైద్యుడి సూచన మేరకు మానేయడమే మంచిదని చెబుతున్నారు.