Reasons For Frequent Urination : సాధారణంగా వయసు పైబడిన వారు ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్తుంటారు. అయితే.. వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు భావించాలని నిపుణులు చెబుతున్నారు. మరి.. మూత్రం ఎక్కువగా రావడానికి కారణాలేంటి? ఎలాంటి ఆరోగ్య సమస్యలు కారణంకావొచ్చు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధుమేహం : సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడేవారికి దాహం ఎక్కువగా వేస్తుంది. దీంతో వారు ఎక్కువగా నీరు తాగుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మూత్రవిసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుందని నిపుణులంటున్నారు. కాబట్టి, మీరు ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్తుంటే.. షుగర్ వ్యాధి పరీక్ష చేసుకోండి. 2003లో "డయాబెటిస్ కేర్" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు సాధారణంగా షుగర్ వ్యాధి లేని వ్యక్తుల కంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తారని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ వై. సుజుకి' పాల్గొన్నారు. టైప్ 2 మధుమేహంతో బాధపడేవారు ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇన్ఫెక్షన్ : మూత్రాశయంలో మంట (సిస్టిటిస్) వంటి సమస్యలు ఎదురైనప్పుడు మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల కూడా తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. అలాగే మూత్రం ముదురు రంగులో వాసన వస్తుంటే.. కూడా ఇన్ఫెక్షన్‌లు ఉన్నట్లు భావించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇలాంటి లక్షణాలు కొంతమందిలో కొన్నిరోజుల తర్వాత తగ్గిపోతాయి. కానీ, దీర్ఘాకాలికంగా మూత్రంలో మంట, అసౌకర్యంగా ఉన్నప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొన్నారు.
ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల : 50 ఏళ్లు పైబడిన పురుషులలో ప్రొస్టేట్ గ్రంథి పెరుగుదల చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే, కొన్ని కారణాల వల్ల చిన్నవయసులోనే కొంతమంది పురుషులలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులంటున్నారు. ఈ ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల వల్ల కూడా తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు.
మెనోపాజ్ : వయసు రీత్యా మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అందులో మెనోపాజ్ దశ ఒకటి. ఈ సమయంలో రుతుక్రమం ఆగిపోతుంది. అయితే.. మెనోపాజ్‌లో సమయంలో మహిళలు తరచుగా మూత్రవిసర్జనగా వెళ్లాల్సి వస్తుంది. ఈ దశలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల మూత్ర వ్యవస్థను ప్రభావితం చేసే హార్మోన్లలో మార్పులు వస్తాయని నిపుణులంటున్నారు.
స్త్రీలలో వచ్చే సమస్యలు : మహిళలలో ఎక్కువ సార్లు మూత్రవిసర్జన అవ్వడానికి.. పెల్విక్ నొప్పి, రక్తస్రావం ఎక్కువగా కావడం వంటి వివిధ కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల వల్ల ఎక్కువసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. కాబట్టి, ఇలాంటి లక్షణాలు కనిపించే వారు వైద్యులు సూచించిన పరీక్షలు చేసుకోవాలని పేర్కొన్నారు.
పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ సమస్యలు : చూడటానికి మూత్ర విసర్జన చేయడం తేలికైన వ్యవహారంగానే కనిపిస్తుంటుంది. కానీ దీనికోసం మూత్రాశయం (బ్లాడర్), మూత్రమార్గ కండర వలయం (స్ఫింక్టర్), మూత్రాశయం కింద ఉండే దృఢమైన కటి కండరాలు (పెల్విక్ ఫ్లోర్ మజిల్స్), నాడులు.. అన్నీ కలిసి, ఒక సమన్వయంతో పనిచేస్తాయి. అయితే, వయసు పైబడుతున్నా కొద్ది మహిళలు, పురుషులలో ఈ పెల్విక్ ఫ్లోర్ మజల్స్ సాగుతుంటాయి.
దీనివల్ల తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని నిపుణులంటున్నారు. అయితే, మూత్రం ఆపలేకపోవటం సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుందట. పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం.. కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రం లీకయ్యేవారికి కటి కండరాలను బలోపేతం చేసే వివిధ రకా కెగెల్ వ్యాయామాలు ఉపయోగపడతాయని.. అవి చేయాలని సూచిస్తున్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.