Over Weight Cause Paralysis Risk in Women : ఆడ, మగ అనే తేడాలేకుండా అందరిలోనూ సకల రోగాలకు కారణం.. "ఊబకాయం". దీనివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే.. వృద్ధాప్యంలో వచ్చే పక్షవాతం కూడా.. అధిక బరువు కారణంగా మధ్యవయసులోనే వచ్చే ముప్పు పెరుగుతోందని చెబుతున్నారు. "అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్" పత్రికలో ప్రచురితమైన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది.
పరిశోధనలో ఆసక్తికర విషయాలు :
అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థ అయిన అమెరిన్ స్ట్రోక్ అసోసియేషన్ చేపట్టిన ఈ పరిశోధనను ఫిన్‌లాండ్‌లో నిర్వహించారు. మొత్తం 50 సంవత్సరాల ఆరోగ్య సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. 14 ఏళ్ల వయసులో అధిక బరువు గల మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. వీళ్లు 31 ఏళ్ల వయసులో బరువు తగ్గినా ఈ ముప్పు పొంచి ఉంటుందట. అలాగే 14 ఏళ్ల వయసులో మామూలు బరువుండి, 31 ఏళ్ల వయసులో బరువు పెరిగినా పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.
టీవీ రిమోట్ - స్నాక్స్ : నష్టం జరిగే ముందు అర్థంకాదు - జరిగిన తర్వాత అర్థమైనా ఉపయోగం లేదు!
ఎత్తు, బరువుల నిష్పత్తితో :
వయసు, ఎత్తు, బరువుల నిష్పత్తిని పోలుస్తూ కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారట. సాధారణంగా పక్షవాతానికి.. అధిక రక్తపోటు, మధుమేహం, పొగతాగే అలవాటు వంటివి కారణం అవుతాయి. ఈ లిస్టులో ఊబకాయం కూడా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
పక్షవాతానికి గురయ్యే ప్రతీ 5 కేసుల్లో.. ఒకటి అధిక బరువు, ఊబకాయంతో ముడిపడి ఉంటోందని చెబుతున్నారు. అధిక బరువు కారణంగా రక్తపోటు పెరుగుతుందని నిపుణులంటున్నారు. ఇంకా.. షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు. ఇవన్నీ కలిసి పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతాయని స్పష్టం చేస్తున్నారు.
బరువు తగ్గితేనే మంచిది!
- ఎక్కువ బరువున్నవారు తమ శరీర బరువులో 7 నుంచి 10 శాతం తగ్గినా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చట.
- కాబట్టి.. రోజూ వ్యాయామం చేస్తూ తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
- అలాగే చక్కెర, తీపి పదార్థాలు, పానీయాలు మానెయ్యాలి.
- కొలెస్ట్రాల్ పెరిగేలా చేసే కొవ్వు, నూనె పదార్థాలను తక్కువగా తినాలి.
- మాంసాహారులైతే చికెన్, చేపలు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా మితంగానే.
- ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి.
- రోజూ కనీసం అరగంట వ్యాయమం చేయాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బిగ్ అలర్ట్ : పక్షవాతం రావడానికి ఒక్క విటమిన్ లోపమే కారణమట! - రీసెర్చ్‌లో తేలిందిదే!
అలర్ట్ : గర్భవతులు జామ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? - పరిశోధనలు చెప్పేది ఇదే!