Carissa Carandas Health Benefits : వర్షాకాలంలో మెట్ట ప్రాంతాల్లో, తోటలు, చేను గట్లపై విరివిగా కాసే ఈ పండ్లు తెలియని వారుండరు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇవి అందరికీ సుపరిచితమే. వారాంతపు సంతల్లోనూ వీటిని కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. కొంత మందికి అవి ఏమిటో తెలియకున్నా రంగు, పరిమాణం చూసి ఆకర్షితులవుతుంటారు.
ఉత్తర తెలంగాణలో వాక్కాయ అని, దక్షిణ తెలంగాణలో కలింపండ్లు, కలేక్కాయ అని వీటికి పేర్లు. ఓ వైపు ఎరుపు, గులాబీ రంగు కలగలిపి, మరో వైపు ఆకుపచ్చ రంగుతో నోరూరించే ఈ పండ్లు రుచి విషయంలో కాస్త వగరు, ఎక్కువ పులుపు రుచిని కలిగి ఉంటాయి. ఈ పండ్లతో కూరలు, పచ్చళ్లతోపాటు రకరకాల పదార్థాలు తయారు చేసుకుంటారు. ఆరోగ్య పరంగానూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
జామపండు Vs డ్రాగన్ ఫ్రూట్ - విటమిన్ పోటీలో విన్నర్ ఎవరంటే! - GUAVA VS DRAGON FRUIT
పాన్ షాపుల్లో స్వీట్ పాన్ టూత్‌పిక్‌కు ఎర్రని పండును గుచ్చి ఉండడం మనం చూసే ఉంటాం. తియ్యని రుచి కలిగిన ఆ పండ్లు చెర్రీస్ అని అనుకుంటారు చాలా మంది. కానీ అవి వాక్కాయలు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ పండ్లను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేయడంతో పాటు కేకులు, సలాడ్ల అలంకరణలో ఉపయోగిస్తారు. పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఈ పదార్థాలన్నింటినీ చేసేది సహజసిద్ధంగా దొరికే కలిమె పండ్లతోనే. ఈ కాయలను చింతపండుకు బదులుగా ఎక్కువగా వాడుతుంటారు. పప్పులో వేయడంతో పాటు రోటి పచ్చళ్లు తయారు చేసుకుంటారు. ఆవకాయ, పచ్చిమిర్చి కలిపి నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారు.
కలిమె పండ్ల చెట్లకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎత్తుగా, పొదలా పెరుగుతాయి. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ సహా మన రాష్ట్రంలోని ఒంగోలు, రాయలసీమలో వీటిని చూడొచ్చు. ఆయా జిల్లాల్లో తోటల చుట్టూ వీటిని పెంచుకుని అటవీ జంతువులు రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు సీజన్‌లో వచ్చే ఈ పండ్లతో వివిధ రకాలైన పదార్థాలు తయారు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు.
వాక్కాయలు విటమిన్ బి, సి, ఐరన్ రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పీచు పదార్థం కడుపు ఉబ్బరాన్ని అడ్డుకుని అజీర్తి సమస్యకు ఔషధంలా ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని పెక్టిన్ అనే కార్బోహైడ్రేట్ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి ఆకలిని పెంచుతుంది. విటమిన్స్‌తో పాటు ట్రిప్టొ ఫాన్ అనే అమైనో యాసిడ్ సెరటోనిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల అవి ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇంకా వీటిలోని పోషకాలు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహకరిస్తాయి. వాక్కాయలు శ్వాసకోశ పరిస్థితులను మెరుగుపరచడం మొదలుకుని చర్మ వ్యాధులకు చికిత్స చేయడం, మధుమేహాన్ని నివారించడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ఫైబర్, విటమిన్ సి అధిక మోతాదులో లభించే కలిమె పండ్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువే. ఆస్తమా, చర్మవ్యాధి బాధితులకు ఎంతో మేలుచేస్తాయి. మూత్ర నాళాన్ని శుభ్రపరచడంతో పాటు కిడ్నీలో రాళ్లు కరిగిపోయేలా సహకరిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హెన్నా పెట్టే ముందు జుట్టు కడుగుతున్నారా?- ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! - henna powder