National Immunization Day 2024 History and Theme : వ్యాక్సిన్లపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 16వ తేదీన నేషనల్ వ్యాక్సినేషన్ డే నిర్వహిస్తున్నారు. దీనినే జాతీయ టీకా దినోత్సవం అని కూడా అంటారు. ఇందులో భాగంగా ఈరోజున టీకా డ్రైవ్‌లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా టీకాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, తీసుకోకపోతే జరిగే నష్టాలు గురించి అవగాహన కల్పిస్తారు. ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి? ఏ వయసులో వ్యాక్సిన్ తీసుకోవాలి వంటి వాటిపై కూడా నిపుణులు సలహా ఇస్తుంటారు. అసలు ఈ రోజునే జరుపుకోవడానికి కారణాలు ఏంటి? ఈ సంవత్సరం థీమ్ ఏంటి? వ్యాక్సిన్ ప్రాముఖ్యత వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఈరోజే ఎందుకు: 1995లో మార్చి 16వ తేదీన జోనాస్ సాల్క్ పోలియో కోసం మొట్టమొదటి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఇండియాలో మొదటిసారి నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సినేషన్ మొదటి డోస్ ఇచ్చారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశం నుంచి పోలియోను నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఈ ఓరల్ పోలియో టీకా అంతర్భాగంగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని ప్రకటించింది. ఆశించిన ఫలితాలను సాధించినప్పటికీ, భారతదేశం, కొన్ని ఇతర దేశాలతో పాటు, పూర్తి పోలియో నిర్మూలనను సాధించడానికి టీకా ప్రచారాలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.
ఈ ఏడాది థీమ్ ఇదే: వ్యాక్సిన్లపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఓ థీమ్‌తో వస్తారు. కాగా ఈ సంవత్సరం నేషనల్ వ్యాక్సినేషన్ డే 2024 థీమ్ ఏంటంటే.. "లింగ బేధం లేకుండా, సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా.. వ్యాక్సిన్లు అందరికీ పని చేస్తాయి(Vaccines Work for All)" అనే థీమ్‌తో వస్తున్నారు. సురక్షితమైన, ప్రభావవంతమై టీకాలు భారత పౌరులకు అవసరమనే అంశాన్ని ఈ థీమ్ వివరిస్తోంది.
అసలు వ్యాక్సిన్ల అవసరమేంటి: అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి వ్యాక్సిన్లు చాలా అవసరం. పలు వైరస్లు, బ్యాక్టీరియా దరి చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయపడతాయి. తద్వార అంటు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లల్లో వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి లేని వారిని వివిధ వ్యాధులను నుంచి రక్షించడంలో వ్యాక్సిన్స్ హెల్ప్ చేస్తాయి. పైగా వ్యాక్సినేషన్ అనేది ప్రజారోగ్య చర్య. ఇది ప్రాణాలను కాపాడుతుంది. అంటువ్యాధుల వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటిజెన్లను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు చాలా హెల్ప్ చేసి పిల్లలను రక్షిస్తాయి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు..: ఎందరో ప్రాణాలు తీసిన మసూచిని అరికట్టడం మొదలు.. రీసెంట్గా ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేసిన కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయగలిగేలా చేసింది వ్యాక్సిన్ మాత్రమే. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలను రక్షిస్తాయి. కేవలం పిల్లలకే కాకుండా పెద్దలు కూడా కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాణాంతక వ్యాధులు రాకుండా.. వచ్చినా వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా చేయడంలో వ్యాక్సిన్స్ కీలకపాత్ర పోషిస్తాయి.
టీకాలు పిల్లలకు మాత్రమే కాదు- పెద్దలకు కూడా ఉన్నాయ్- అవేంటంటే?