Milk Aversion During Pregnancy : గర్భధారణ సమయంలో కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే, ఈ టైమ్‌లో గర్భిణులు పాలు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, కొందరికి పాలను చూస్తేనే వాంతిగా, వికారంగా అనిపిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇలాంటి వారు పాల ద్వారా వచ్చే పోషకాలను ఎలా భర్తీ చేసుకోవాలో ప్రముఖ పోషకాహార నిపుణురాలు 'డాక్టర్ లతాశశి' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
గర్భిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, సాధారణంగానే గర్భధారణ సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినాలనిపించదు. శరీరంలో హార్మోన్లలో మార్పుల కారణంగా రుచి, వాసన, టెక్స్చర్‌కు సంబంధించి సెన్సిటివిటీ పెరుగుతుంది.
దీంతో కొంతమందికి కొన్ని ఆహారాలు నచ్చకపోవడం, వాంతులు అవడం, గ్యాస్ ఉన్న భావనా కలుగుతుంది. మరికొందరికేమో ఎక్కువగా తినాలనిపిస్తుంది. అయితే.. ఇలాంటి ఫీలింగ్స్ వారాలు గడిచేకొద్దీ తగ్గుతాయి. కాబట్టి, పాలు నచ్చడం లేదని అసలు తాగడం మానేయొద్దు. రెండు వారాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి.
"గర్భిణిగా ఉన్నప్పుడు పాలు, పాల పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిద్వారా బిడ్డకూ, మీకూ అన్ని పోషకాలు అందుతాయి. పాలు బాడీకి అవసరమైన అమైనోయాసిడ్లు అందిస్తాయి. కాల్షియం, విటమిన్-డి, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి. గర్భిణిగా ఉన్నప్పుడు ప్రతిరోజు 400- 600 మి.లీ పాలు తాగాలి. 100 మి.లీ పెరుగు, 30 గ్రాముల పన్నీర్ వంటివీ తీసుకోవచ్చు."- డాక్టర్ లతాశశి, పోషకాహార నిపుణురాలు
ఒకవేళ, పాలు నేరుగా తాగలేకపోతే.. పాలలో యాలకులు, పసుపు, నట్స్.. లాంటివి ఏదో ఒకటి కలిపి తీసుకోండి. అలాగే ఫ్రూట్ కస్టర్డ్, పాన్‌కేక్స్, కూరలతో కలిపి కూడా పాల పదార్థాలు వాడొచ్చు. గ్యాస్ ఇబ్బందితో బాధపడేవారు చల్లనిపాలు తాగడం మంచిది. ఇలా ప్రతిరోజూ పాలను తాగడం వల్ల అసౌకర్యంగా అనిపించదని డాక్టర్ లతాశశి సూచిస్తున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు పాలు తాగడం ద్వారా.. తల్లీబిడ్డ హెల్దీగా ఉండడానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
'తల్లులు సరిగ్గా నిద్రపోతేనే పిల్లలు హుషారుగా పుడతారు'- మరి ఎంత సేపు నిద్రపోవాలి?