Ladies Finger For Diabetes : వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తెచ్చుకుంటున్నామంటే అందులో కచ్చితంగా బెండకాయ ఉండాల్సిందే. భారతీయ వంటకాల్లో బెండకాయకు అంత ప్రాధాన్యత ఉంది మరీ. బెండీ కర్రీని మధ్యాహ్నం అన్నంలోకి, రాత్రి చపాతీలోకి నిస్సందేహంగా తినేయచ్చు. ఇది మామూలు వారి సంగతి మరి మధుమేహం ఉన్నవారి సంగతేంటి? డయాబెటీస్ పేషెంట్లు బెండకాయలను నిర్భయంగా తినొచ్చా? తింటే కలిగే లాభనష్టాలేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
2013లో యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చేసిన అధ్యయనంలో తెలిసిన ప్రకారం మధుమేహ సమస్యతో ఇబ్బంది పడేవారికి లేడీస్ ఫింగర్ చాలా చక్కటి ఆహారమట. ముఖ్యంగా బెండకాయలోని గింజలు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో తగ్గుదల కనిపించిందట. వంద గ్రాముల బెండకాయల్లో దాదాపు 33కేలరీలు, 7గ్రాముల వరకూ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వాటితోపాటు దాదాపు 3గ్రాముల ఫైబర్, 2గ్రాముల వరకూ ప్రొటీన్లు, గ్రాముకు కాస్త తక్కువ కొవ్వుతో పాటు విటమిన్-సీ, విటమిన్-కే, ఫోలేట్ ఉంటాయట. అలాగే బెండకాయ గింజల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి పోషకాలు కూడా మెండుగా దొరుకుతాయట.
బెండకాయ తినడం వల్ల లాభాలు
గ్లైసిమిక్స్ లెవెల్స్ : బెండకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది వేగంగా పెరుగుతున్న చక్కెర శాతానికి అడ్డుకట్ట వేస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.
ఫైబర్ : బెండకాయలో ఉండే ఫైబర్ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ : క్వెర్సెటిన్, కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కలిగిన బెండకాయల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల కలిగే నష్టం నుంచి కాపాడతాయి. ఫలితంగా రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇన్సులిన్ సెన్సిటివిటీ : బెండకాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చక్కగా సహాయపడుతుంది.
ఓక్రా వాటర్(బెండకాయ నీరు) : ఉదయాన్నే ఓక్రా వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే షుగర్ సమస్యతో ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదని వైద్యులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ఓక్రా వాటర్ తయారీ విధానం
- నాలుగు బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి అడ్డంగా చీల్చండి.
- వాటిని ఓ గ్లాసు నీటిలో నిలువుగా పెట్టి రాత్రంతా నాననివ్వండి.
- ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి తాగండి. రుచి కోసం కాస్త ఉప్పు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.