Immunity Boosting Asanas In Telugu : యోగా వల్ల శరీరానికి కలిగే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు యోగాసనాల సాధనతో శరీరంతో పాటు మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతే కాకుండా ఎటువంటి జబ్బులు దరిచేరవు. అయితే ఈ కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే చాలామంది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రకరకాల పండ్లు, ఆహార పదార్థాలు తీసుకుంటారు. అయితే ఈ ఐదు యోగాసనాల ద్వారా మన రోగనిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
మీ రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు యోగాసనాలు
1. మండుకాసనం
ఈ ఆసనం వేయటానికి మొదటగా వజ్రాసనంలో కూర్చోవాలి. మీ రెండు కాళ్లు దగ్గరకు అనుకొని బొటనవేళ్లను బిగించాలి. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ మీ పొత్తి కడుపుని లోపలికి లాగుతూ ముందుకు వంగండి. మీ పిడికిలి అనేది నాభి భాగానికి వ్యతిరేకంగా ఉండేట్లు చూసుకోండి.
2. సమకోణ ఆసనం
ఈ ఆసనానికి మొదటగా నిట్ట నిలువుగా నిల్చొండి. అనంతరం కిందకి వంగుతూ రెండు కాళ్లనూ సాధ్యమైనంత రెండు వైపులా పక్కకు చాపండి. అదే విధంగా కాళ్లను చాపుతున్నప్పుడు మెకాళ్లు సరిగ్గా ఉండేలా చూసుకోండి.
3.తాడాసనం
ఈ ఆసనంలో మొదటగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకెత్తాలి అనంతరం వాటిని గట్టిగా బిగించాలి. ఆ తర్వాత మీ ఎడమకాలు తొడ పైన కుడి కాలును ఉంచాలి. కొంతసేపు తర్వాత అదే ఆసనం మరో కాలితో చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
4. బాలాసనం
ఈ ఆసనం మీ రోగనిరోధక శక్తి పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిని వేయడానికి ముందుగా నేల మీద మోకాళ్ల పై కూర్చోవాలి. అనంతరం శ్వాస వదులుతూ శరీరాన్ని ముందుకు వంచాలి. తలను మోకాళ్ల మధ్యలో ఉన్న స్థలంలో తాకేలా చూడాలి. చేతులను ముందుకు చాపుతూ భూమికి తాకించాలి. శ్వాస తీసుకుంటూ ఆపుతూ ఉండాలి. ఇలా కొద్ది సేపు చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
5. ధనురాసనం
ఈ ఆసనం మీ శరీరంలో రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత పొట్ట మీద పడుకుని రెండు మోకాళ్లనూ వెనక్కి మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. తొడలుపైకి ఉండాలన్నమాట. ఇలా కాసేపు సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ మరోసారి చేయాలి.
ఇవండీ మీ రోగనిరోధక శక్తిని పెంచి మీ ఆరోగ్యాన్ని కాపాడే ఐదు యోగాసనాలు వీటిని రోజూ సాధన చేస్తూ ఆరోగ్య వంతమైన జీవితం గడపండి.