Immunity Booster Drink at Home: చలికాలంలో వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, ఫ్లూతో పాటు అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటితో పోరాడాలంటే శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇమ్యూనిటీని పెంచుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఈ పానీయాలను తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధకశక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి రసం: చలికాలంలో మాత్రమే దొరికే ఉసిరితో అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం వల్ల విటమిన్ సి అధికంగా లభిస్తుందని తెలిపారు. ఫలితంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని 2020లో "ఫుడ్ ఫంక్షన్" జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో తేలింది. చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జియాన్ షు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.
పసుపు పాలు: కాచిన పాలలో కొద్దిగా పసుపు కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నిండి ఉండే ఈ పాలు ఇమ్యూనిటీతో పాటు పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాయని వివరించారు.
తులసి, అల్లం టీ: తులసిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తులసి, అల్లంతో చేసిన టీలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయని అంటున్నారు.
తేనె, నిమ్మ: మనలో చాలా మంది ఉదయాన్నే తేనె, నిమ్మకాయ రసం తాగుతుంటారు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని నిపణులు అంటున్నారు. వేడి నీళ్లలో నిమ్మరసంతో పాటు తేనె కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి, తెల్లరక్త కణాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇంకా శరీరంలోని మలినాలు బయటకు పోతాయని వివరించారు.
అశ్వగంధ: ఆయుర్వేద మందుల్లో ఉపయోగించే ఆశ్వగంధ మూలికతో ఇమ్యూనిటీ వ్యవస్థ దృఢంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా అశ్వగంధ పొడి కలిపి తాగితే మంచిదని అంటున్నారు.
గ్రీన్ టీ: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని కణాలను దెబ్బతీసే ప్రీ రాడికల్స్పై పోరాడతాయని వివరించారు. గ్రీన్ టీలో ఓ చిటికెట్ దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
క్యారెట్, బీట్ రూట్ జ్యూస్: వీటిలో విటమిన్ ఏ, సీ తో పాటు పొటాషియం, ఫోలేట్ అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో తయారు చేసిన జ్యూస్ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుందని వివరించారు. రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీరాన్ని డీటాక్స్ చేస్తుందని తెలిపారు.
మసాలా ఛాయ్: యాలకలు, లవంగాలు, సిలోన్ దాల్చిన చెక్క, అల్లం వేసి టీ పెట్టుకుని తాగాలని సూచిస్తున్నారు. చక్కెరకు బదులుగా బెల్లం వినియోగించాలని సలహా ఇస్తున్నారు. ఇవన్నీ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గాను పనిచేస్తాయని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు ఏ పక్కకి తిరిగి పడుకుంటారు? ఏ సైడ్ నిద్రపోతే బెస్ట్ మీకు తెలుసా?\
మీరు రోజు చపాతీలు తింటున్నారా? ఇలానే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?