Good Food Habits for Healthy Heart: ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కచ్చితంగా పోషకాలు కలిగినదై ఉండాలి. అలాకాకుండా మన శరీరానికి హాని చేసే ఆహారం తీసుకుంటే మాత్రం.. ఆరోగ్యానికి నష్టం తప్పదు. ముఖ్యంగా ఈ ఆహారాలను తింటే.. గుండె వ్యాధులు, మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆహారాల వల్ల మరణించే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గుండెపోటు, మధుమేహం లాంటి వ్యాధుల బారిన పడి మరణించేవారిలో ఈ ఆహార పదార్థాలు ఎలా ప్రభావితం చేశాయో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అవి.. సోడియం అధికంగా ఉండే ఫుడ్స్, ప్రాసెస్డ్ మాంసం, చక్కెర పానీయాలు, అన్ ప్రాసెస్డ్ మాంసం తీసుకునేవారు గుండె సంబంధిత రోగాలు, డయాబెటిస్తో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఇదే కాకుండా గింజలు, తృణధాన్యాలు, ఓమేగా 3 ఫ్యాట్స్, సీ ఫుడ్, కూరగాయలు, పండ్లు తక్కువగా తినేవారిలోనూ మరణించే అవకాశాలు అధికంగానే ఉన్నాయని వివరించారు.
2012లో Journal of the American Medical Associationలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ వ్యాధుల బారిన పడి మరణించినవారిలో ఈ 10 రకాల ఆహారాలు ప్రభావితం చేశాయని వెల్లడించారు. National Heart, Lung, and Blood Institute (NHLBI)తో పాటు Bunge Fellowship in Global Nutrition సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ అధ్యయనాన్ని(రిపోర్ట్) చేపట్టాయి. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES), జాతీయ మరణాల డేటా ఆధారంగా వైద్యులు పరిశోధన చేశారు. గుండె సమస్యలతో మరణించిన చాలా మందిలో ఆహారపు అలవాట్లు ప్రభావితం చేశాయని డాక్టర్ డెవిడ్ గోఫ్ తెలిపారు. ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకున్న వారిలో మరణాలు తగ్గినట్లు ఈ అధ్యయనంలో తేలిందన్నారు. అందుకే గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు మెరుగైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని వివరించారు.
ఈ ఫుడ్స్ తీసుకుంటే మంచిది: ఆరోగ్యకరమైన జీవితం కోసం కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు లేదా కొవ్వు లేని పదార్థాలను తీసుకోవాలని వివరించారు. దీంతో పాటు మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, బీన్స్, గుడ్లు, గింజధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి సాచురేటేడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం, చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయని తెలిపారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.