How To Stop Vomiting While Travelling : మనలో కొంతమందికి జర్నీ అంటే పడదు! బస్సు, రైలు, కారు ఏ బండి ఎక్కినా సరే, ఎక్కి కూర్చున్న కొద్దిసేపటికే తలతిప్పడం మొదలైపోతుంది. ఒకటే వికారంగా ఉంటుంది. వాహనాల నుంచి వచ్చే వాసన, కుదుపుల వల్ల కొన్నిసార్లు వాంతులు కూడా చేసుకుంటారు. ఇలా ఇబ్బంది పడేవారు కొన్ని టిప్స్ పాటిస్తే.. ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రయాణంలో తలతిప్పడం, వికారంగా ఉండటం, వాంతులు కావడం వంటి లక్షణాలను "మోషన్ సిక్‌నెస్" (Motion Sickness) గా పిలుస్తారు. ఈ సమస్య పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నుంచి బయట పడడానికి జర్నీ సమయంలో ఈ టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం : జర్నీ చేసేటప్పుడు వాంతులు, వికారంగా ఉండటం, తలతిప్పడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక చిన్న అల్లం ముక్కను నమలడం ద్వారా మంచి ఫలితం ఉంటుందట. అలాగే అల్లం టీ తాగడం వల్ల కూడా తలతిప్పే సమస్య తగ్గుతుందని డాక్టర్ పూజిత (జనరల్ ఫిజిషియన్) చెబుతున్నారు.
యాలకులు :
దాదాపు మనందరి ఇళ్లలో యాలకులు ఉంటాయి. జర్నీ చేసేటప్పుడు వాంతులు, తలనొప్పి, వికారంగా అనిపించినప్పుడు యాలకులతో చేసిన టీ తాగడం వల్ల రిలీఫ్ పొందవచ్చని నిపుణులు పేర్కొన్నారు. అలాగే యాలకులను నమలడం వల్ల వాంతులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
- ప్రయాణం చేస్తున్నప్పుడు వాంతులు అవుతున్నట్లుగా అనిపిస్తే రెండు మూడు తులసి ఆకులు నమలడం వల్ల ప్రయోజనం ఉంటుందట.
- జర్నీలో తలతిప్పినట్లుగా అనిపిస్తే ఒక రెండు లవంగాలను నమలినా ఫలితం ఉంటుందట. లేదంటే లవంగాలను నీటిలో మరిగించి ఆ నీటిని తాగినా కూడా తలనొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని టిప్స్ మీ కోసం..!
- జర్నీ చేస్తున్నప్పుడు వికారంగా అనిపించేవారు.. ప్రయాణానికి ఒక గంట ముందు ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిదట.
- ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్‌గా ఉండే ఆహారం తినాలి.
- ప్రయాణానికి ముందు ఎక్కువగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు!
- మోషన్ సిక్‌నెస్ ఉన్నవారు కారు, బస్సు, రైలులో ప్రయాణించేటప్పుడు విండో సీట్ దగ్గర కూర్చోవడం మంచిది.
- అలాగే జర్నీ పూర్తి అయిన తర్వాత బాగా రెస్ట్ తీసుకోవాలి.
- జర్నీ చేసేటప్పుడు మనసు తలనొప్పి, వాంతుల వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఇందుకోసం మీకు ఇష్టమైన మ్యూజిక్‌ను వింటూ ఎంజాయ్ చేయండి. ఇలా సంగీతం వినడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- ఈ టిప్స్ పాటిస్తే.. వాంతులు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు దాదాపుగా కనిపించవని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.