Fever Treatment In Ayurveda: చలికాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో ముఖ్యంగా జ్వరం చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ క్రమంలోనే దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులు వేసుకుంటారు. కానీ ఇంట్లోనే ఉండే ఈ పదార్థాలతో ఔషధం తయారు చేసుకుని తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇంకా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కూడా దీనిని తీసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు గాయత్రీ దేవీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 50 గ్రాముల శొంఠి చూర్ణం
- 50 గ్రాముల మిరియాల చూర్ణం
- 50 గ్రాముల ధనియాల చూర్ణం
- 50 గ్రాముల పసుపు
- 50 గ్రాముల తులసి చూర్ణం
తయారీ విధానం
- ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో 100 మిల్లీ లీటర్లు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
- ఇవి వేడయ్యే లోపు మరో గిన్నెలో శొంఠి చూర్ణం, మిరియాలు, ధనియాలు, పసుపు, తులసి చూర్ణం వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు మనం కలిపిన చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకుని ఈ నీటిలో వేసుకుని మరిగించుకోవాలి.
- బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వడబెట్టుకుంటే ఆయుర్వేద ఔషధం రెడీ
ఎప్పుడు? ఎంత మోతాదులో తీసుకోవాలి?
చలికాలంలో జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి సుమారుగా 40-50 మిల్లీ లీటర్ల పరిమాణంలో మూడు పూటాల తీసుకోవాలని చెబుతున్నారు. ఇంకా జ్వరం రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చని అంటున్నారు. ఇలాంటి వారు ఉదయం, సాయంత్రం 30 మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకోవాలని వివరించారు.
శొంఠి: చలికాలంలో వచ్చే కఫాన్ని తగ్గించడంలో శొంఠి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి సమస్యను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మిరియాలు: మిరియాలను అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వాడుతుంటారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇందులో అజీర్తి సమస్యను తగ్గించే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు.
పసుపు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, వైరస్లను తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.
తులసి: ఆయుర్వేద ఔషధాల తయారీలో తులసి మొక్కను అనేక రకాలుగా వాడుతుంటారు. వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరాలు తగ్గడానికి తులసి చాలా సహాయపడుతుందని అంటున్నారు.
ధనియాలు: జరాన్ని తగ్గించడంలో ధనియాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు ధనియాల కషాయం చేసుకుని తాగితే సరిపోతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి