Lifestyle Habits to Keep Ear Healthy : ఈ రోజుల్లో చెవి, ముక్కు, గొంతు(Throat) సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అందువల్ల వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం పలు జీవనశైలి అలవాట్లను కూడా సూచిస్తున్నారు. వాటిని ఫాలో అయ్యారంటే ఈ మూడు భాగాల పనితీరు మెరుగుపడి హెల్తీగా ఉంటారని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చెవుల ఆరోగ్యం కోసం :
- ఈరోజుల్లో పాటలు వినడానికి ఎక్కువమంది ఇయర్‌బడ్‌లు, ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వంటివి వినియోగిస్తున్నారు. ఇవి చెవులకు ఆరోగ్యకరం కాదనే విషయాన్ని మీరు గమనించాలి. వీలైతే వాటిని ఉపయోగించకపోవడమే బెటర్. ఎందుకంటే అవి మీ ఇయర్స్‌కు నష్టం కలిగించి వినికిడి లోపం వచ్చేలా చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇకపోతే చాలా మంది చెవుల్లో గుబిలి తీసుకునేందుకు ఎక్కువగా పిన్నీసులు వంటి కొన్ని లోహ వస్తువులను యూజ్ చేస్తుంటారు. కానీ, అలా చేయడం చెవుల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఆ విధంగా చేయడం ఇయర్ డ్రమ్‌కు గాయం కలిగించే ఛాన్స్ ఉంది. లేదంటే ఇయర్ వ్యాక్స్‌ను వెనక్కి నెట్టేస్తుంది.
- మీ చెవిని పొడిగా ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ, చెవిలో నీరు పోయడం లేదా ఇతర ద్రవాలు వేయకూడదు. వాటి వల్ల ఇయర్స్ మూసుకుపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాటిని తేమగా ఉండకుండా చూసుకోవడం బెటర్.
- మీ చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మరో పని.. పెద్ద శబ్దాలకు దూరంగా ఉండడం. ఒకవేళ మీ వృత్తిలో భాగమయితే మాత్రం వాటికి సరైన రక్షణా చర్యలు తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- అదేవిధంగా మీ చెవుల వినికిడి ఎలా ఉందని తెలుసుకోవడానికి కనీసం ఏడాదికి ఒకసారైనా ENT సర్జన్ సంప్రదించి చెక్ చేయించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
దగ్గు తీవ్రంగా వేధిస్తోందా? - అయితే అది 100 రోజుల దగ్గు కావొచ్చు!
ముక్కు కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు :
- సాధారణంగా శ్వాస వ్యాయామాలు మీ మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనవి. అలాగే మీరు దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడతాయి.
- ముక్కు మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అది ముక్కు రక్తస్రావానికి దారి తీయవచ్చు.
- మీకు డస్ట్ అలర్జీ ఉన్నట్లయితే దుమ్ము, పొగ మొదలైన వాటికి గురికాకుండా ఉండండి.
- వాటిని పీల్చుకోకుండా బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం మంచిది.
- జలుబు రావడానికి వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు సాధారణ కారణాలు. కాబట్టి అవి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
గొంతు ఆరోగ్యం కోసం కొన్ని అలవాట్లు :
- గొంతు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. చల్లటి గాలి లోపలికి వెళ్లకుండా చూసుకోవడం. ముఖ్యంగా చలి వాతావరణంలో తిరుగుతున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
- ఫలితంగా గొంతు నొప్పి, జలుబు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చలి గాలి చొరబడకుండా మఫ్లర్ ఉపయోగించడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- చాలా మంది కొన్నిసార్లు బిగ్గరగా అరవడం, కేకలు వేయడం చేస్తుంటారు. కానీ, అలా చేయడం గొంతు ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే స్వర పేటికకి తగిన విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే గొంతు దెబ్బతినే ఛాన్స్ ఉంది.
- తినే ఆహారం కూడా గొంతు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తినే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- ముఖ్యంగా నూనె, వేయించిన, చల్లని ఆహారాన్ని తినడం గొంతుపై ప్రభావం చూపుతుంది.
- బర్నింగ్ సెన్సేషన్, పొడి దగ్గు, కొన్నిసార్లు వాయిస్ మారడం వంటి సమస్యలు రావొచ్చు.
- వోకల్ వార్మప్‌లు, వోకల్ న్యాప్‌లు రెండూ ఒక ప్రొఫెషనల్ వాయిస్ యూజర్‌కి అవసరం. గాయకుడు లేదా ఉపాధ్యాయులకు ఇది ముఖ్యం. వాయిస్‌ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి.
- మీరు పొడి వాతావరణంలో ఉంటే ఇంట్లో హ్యూమిడిఫైయర్ ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇది పొడి వాతావరణాన్ని నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది. లేదంటే గొంతు తడి ఆరిపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
- ఇలా మేము చెప్పినట్లు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.